ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. తద్వారా ఒకవంక అభివృద్ధి అంశంతో పాటు హిందుత్వ అంశం కూడా ఎన్నికలలో ప్రధానంగా ఓటర్లకు చేరేందుకు దోహదపడగలదని భావిస్తున్నారు.
ఆదిత్యనాథ్, యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా తదితరులు మంగళవారం దేశ రాజధానిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
అయోధ్య నుండి ముఖ్యమంత్రి పోటీ చేయడం పార్టీ మద్దతుదారులకు `అంతిమ’ సందేశం ఇచ్చిన్నట్లు కాగలదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం మొదటి సారి కావడమే కాకుండా, తన స్వస్థలం గోరఖపూర్ వెలుపల పోటీ చేయడం కూడా ఇదే మొదటిసారి కాగలదు. ఇప్పటి వరకు ఐదు సార్లు వరుసగా అక్కడి నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు.
అంతేగాక, ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం కూడా ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి కాగలదు. చివరి సారిగా, 2002లో రాజనాథ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉంటూ పోటీ చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తున్న అఖిలేష్ యాదవ్, మాయావతి అసెంబ్లీ ఎన్నికలలో తాము పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
ఏది ఏమైనా ఆదిత్యనాథ్ పోటీ విషయమై బిజెపి అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, అమిత్ షా, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి ఎస్ సంతోష్ లతో కూడిన కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేయవలసి ఉంది. ఈ కమిటీ సమావేశం త్వరలో జరిగే అవకాశం ఉంది.
మథుర, సీఎం కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌లోని నియోజకవర్గం లేదా బీజేపీ అత్యంత క్లిష్ట పోరాటాన్ని ఎదుర్కొంటున్న పశ్చిమ యూపీలోని ఒక నియోజకవర్గంతో సహా ఆదిత్యనాథ్ పోటీ చేసే సీట్ల గురించి ఇప్పటి వరకు పార్టీలో చర్చలు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఆయన అయోధ్యపై ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయన ప్రస్తుతం శాసనమండలి సభ్యునిగా ఉన్నారు.
గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలు బిజెపి ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకొంటున్న శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన కఠినంగా వ్యవహరించడం, హిందుత్వ ప్రతినిధిగా వ్యవహరించడం కీలక అంశాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సుదీర్గ్గాకాలం పోరాటాల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం కార్యరూపాం దాలుస్తుండడం కేంద్రం అంశం అయ్యే అవకాశం ఉంది.
అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గం 1991 నుండి దాదాపు నిరంతరం బిజెపి ఆధీనంలోనే ఉంది. 2012 వరకు లల్లూ సింగ్ (ప్రస్తుతం ఫైజాబాద్ నుండి ఎంపీ) గెలుపొందారు. 2017లో బిజెపి అభ్యర్థి వేద్ ప్రకాష్ గుప్తా దానిని తిరిగి చేజిక్కించుకున్నప్పటికీ, ఆ సంవత్సరం, ఎస్పీ ఆ స్థానాన్ని గెలుచుకుంది.