ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేంద్ర మంత్రులు, ఎంపీలు 21 మందిని అసెంబ్లీకి పోటీచేయించిన బిజెపి నాయకత్వం ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న మంత్రులు, ఇతర కీలక నాయకులను ప్రత్యేక్ష ఎన్నికలలో పోటీచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు తెలుస్తున్నది. తొమ్మిది మంత్రి రాజ్యసభ సభ్యులు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. వారంతా ఇప్పుడు పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లకు వారి సొంత రాష్ట్రమైన తమిళనాడు నుండి పోటీచేసే గెలుపొందే అవకాశాలు లేకపోవడంతో బిజెపికి బలం గల కర్ణాటకలో వారికి సురక్షితమైన సీట్లను బిజెపి అన్వేషిస్తున్నట్లు తెలుస్తున్నది.
కర్నాటక నుంచి నిర్మల, గుజరాత్ నుంచి జైశంకర్‌లు ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దక్షిణ కన్నడ స్థానం నుంచి నిర్మలను పోటీలోకి దించాలని భావిస్తున్నారు. కర్నాటక మాజీ అధ్యక్షుడు నలిని కుమార్ కతీల్ గతంలో ఆ స్థానం నుంచి గెలుపొందారు. ఇక బెంగుళూరు సౌత్ లేదా బెంగుళూరు సెంట్రల్ నుంచి జైశంకర్‌ను నిలబెట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గత లోక్ సభ ఎన్నికలలో కర్ణాటకలో 28 స్థానాలలో 25 బీజేపీ గెలుపొందింది. అయితే గత ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలలో పడకుండా ఉండేందుకు కనీసం 11 మంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోమని పలువురు సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే అధిష్టానాన్ని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మాజీ సీఎం సదానంద గౌడ తాను 2024 ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇదివరకే చెప్పారు. నవంబర్ లో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు మరో 10 మంది పోటీకి ససేమిరా అంటున్నారు. వీరిలో కొందరికి ఆరోగ్యం సహకరించట్లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సిట్టింగ్ లను మార్చడంతో కొత్తవారికి పార్టీలో అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రభావం లోక్ సభ ఎన్నికలపై ఉండకుండా చూసేందుకు ఇప్పటికే బీజేపీ జేడీఎస్ తో పొత్తు ఏర్పర్చుకుంది. ఆ పార్టీకి నాలుగు సీట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది తెలిపింది. అంటే,బిజెపి కేవలం 24 సీట్లలో మాత్రమే పోటీచేయగలదు. అయితే, జేడీఎస్ కు కేటాయించే సీట్లపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలతో పని చేస్తున్న బీజేపీ ఈ సారి దేశ వ్యాప్తంగా ఏకంగా 400 లోక్ సభ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.