బిజెపి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు అయిన `ఇండియా’ కూటమి అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఎన్నుకున్నారు. శనివారం జరిగిన ఇండియా వేదిక నేతల వర్చువల్ సమావేశంలో ఖర్గే పేరు ఖరారు చేశారు.
కూటమికి సమన్వయకర్తగా బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. అయితే అందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.
వర్చువల్ సమావేశంలో నితీశ్‌ను ఇండియా కూటమి కన్వీనర్‌గా నితీశ్‌ను చేయాలన్న ప్రతిపాదన వచ్చిందని, అయితే నితీశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతను ఈ పదవికి ఎంపిక చేస్తే బాగుంటుందని నితీశ్ సూచించారని జెడియు జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఝా పాట్నాలో చెప్పారు.
నితీశ్ పేరుకు ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేదు కానీ తాను ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో చర్చిస్తానని ఖర్గే చెప్పారు. వీటితో పాటు సీట్ల పంపకంలో ఎదురవుతున్న సవాళ్ల పైనా ప్రధానంగా చర్చించారు.
మణిపూర్‌లో జనవరి 14న ప్రారంభం కానున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో కూటమి పార్టీల భాగస్వామ్యంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, పార్టీ అధినేత్రి కనిమొళి కరుణానిధి చెన్నైలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. కాగా, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాక్రే హాజరు హాజరు కాలేదు. రాష్ట్ర స్థాయిలో విభేదాలు జాతీయ స్థాయి ఐక్యతకు అవరోధం కారాదని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.