* నేడు జయంతి
భారతదేశం అమెరికా తర్వాత మందుల తయారీ, పంపిణీ లో ప్రముఖ స్థానం పొందింది. హైదరాబాద్ లో అనేక భారీ రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వందేళ్ళ క్రితమే వీటికి పునాదులు పడ్డాయి. సర్ రోనాల్ రాస్ సికింద్రాబాద్ లోనే పరిశోధనలు చేశారు.ఇంకా అనేక మంది ఇటువంటి పరిశోధనలు చేశారు. ఇందులో
ప్రముఖ జీవ రసాయన శాస్త్ర వేత్త యల్లాప్రగడ సుబ్బారావు ఒకరు.
ఆయన ఎన్నో ప్రాణాంతకమైన అనేక వ్యాధులకు చికిత్సలను కనుగొన్నారు. లాభాపేక్ష లేకుండా మానవాళికి ఉపకారం చేశారు. సుబ్బారావు తన ఆవిష్కరణలను ఏనాడూ అమ్ముకోలేదు. పేటెంట్స్ తీసుకోలేదు.
సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో1895 జనవరి12న జన్మించారు. ప్రాధమిక విద్య రాజమండ్రిలో, మెట్రిక్యులేషన్ మద్రాసు హిందూ హైస్కూలులో, ఇంటర్మీడియట్ ప్రెసిడెన్సీ కళాశాలలో, వైద్య విద్య మద్రాసు మెడికల్ కాలేజీలో పూర్తి చేశారు.
స్వదేశీ ఉద్యమానికి ప్రభావితుడై ఖాదీ వస్త్రాలను ధరించారు.దాంతో ఆంగ్ల ప్రొఫెసర్లు ఆగ్రహించటం వలన ఆయనకు ఎంబిబిఎస్ పట్టా లభించలేదు. తక్కువ స్థాయి ఎల్ ఎం ఎస్ పట్టా మాత్రమే లభించింది. మద్రాసు ఆయుర్వేద కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరారు.
1919 లో ఆయన తనకన్నా చిన్నదైన శేషగిరిని వివాహమాడారు. 1923 లో పై చదువుల కోసం మామ గారి సహాయంతో అమెరికాలోని బోస్టన్ చేరుకున్నారు.అక్కడ డా.రిచర్డ్ స్ట్రాంగ్ ఆర్ధికంగా అందుకొన్నారు.హార్వర్డ్ కళాశాలనుండి ట్రాపికల్ మెడిసిన్ లో డిప్లొమా పొందారు. 1940 లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లెడెర్ల్ ప్రయోగశాలలో చేరారు. ఎటిపిపై ఆయన చేసిన పరిశోధనలకు గాను పిహెచ్ డి లభించింది.
డా.సైరస్ ఫిస్క్ తో కలిసి రక్తంలోనూ , మూత్రంలోను ఉన్న ఫాస్ఫరస్ ను తెలుసుకోవడానికి ఫిస్క్-సుబ్బారావు పద్ధతిని కనుగొన్నారు. అన్ని జీవ రసాయన ప్రక్రియలకు అవసరమైన శక్తి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ నుంచి లభిస్తుందని కనుగొన్నారు.
కాలేయాన్నుంచి తీసిన విటమిన్ బి 12 తో రక్త హీనతను నివారించే వచ్చని కనుగొన్నారు. ఫోలిక్ ఆమ్లాన్ని సంశ్లేషించారు. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే మెథాట్రెక్సేట్ ను కనుగొన్నారు.ఫైలేరియా చికిత్సకు ఉపయోగపడే హెట్రజాన్ ను కనుగొన్నారు.యాంటీ బయోటిక్ టెట్రాసైక్లిన్ ఆవిష్కరణకు సారధ్యం వహించారు.
సుబ్బారావు సహచరుడు,
1988లో గెట్రూడ్ ఎలియాన్తో కలిసి వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్ మాటల్లో: “ఫిస్క్, అసూయతో సుబ్బారావు పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడం వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చింది”.
సుబ్బారావు గారి గౌరవార్థం ఒక శిలీంధ్రానికి ఆయన పేరు పెట్టారు.1948 ఆగష్టు 9న తీవ్రమైన గుండె పోటుతో మరణించారు.అప్పటికి ఆయన వయస్సు 53 సంవత్సరాలు మాత్రమే. సుబ్బారావు గారి శత జయంతిని 1995లో నిర్వహించారు.సుబ్బారావు వంటి శాస్త్రవేత్తలని మనదేశం మరింత ప్రోత్సహించి ఉంటే కరోనా మహమ్మారి వంటి వాటికి మనమే స్వయంగా వ్యాక్సిన్ కనుగొని ఉండేవాళ్ళం.