మహారాష్ట్రలో కాంగ్రెస్ కీలక నేత మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు చేరనున్నారు. తన రాజీనామా విషయాన్ని మిలింద్ దేవరా స్వయంగా ఎక్స్ వేదికగా తెలిపారు.
” రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ” అని పేర్కొన్నారు.
దేవరా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వెంటనే మిలింద్ దేవరా శివసేనలో చేరాలని నిర్ణయించుకుంటే తాను స్వాగతిస్తానని షిండే ప్రకటించారు. మిలింద్ దేవరా వ్యవహారం తాను విన్నానని, ఆయన తమ పార్టీలో చేరితే స్వాగతిస్తానని షిండే పేర్కొన్నారు.
ముంబయి సౌత్ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్‌గా నిలిచారు.
ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కాగా, ప్రధాని మోదీ నిర్ణయించిన సమయానికే మిలింద్ దేవ్రా రాజీనామా చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. మిలింద్ తండ్రి మురళీ దేవ్రా ఎప్పుడూ కాంగ్రెస్ పక్షపాతిగానే ఉన్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గుర్తు చేశారు.