ఏడాదిన్నర కిందట భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3,500 కి.మీ. పాదయాత్ర చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు మళ్లీ జనం బాటపట్టారు. ఆదివారం ఆయన మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టారు.
మణిపూర్‌లోని తౌబల్ జిల్లాలో ఓ ప్రైవేట్ మైదానం నుంచి యాత్రను ప్రారంభించారు. మొత్తం 67 రోజుల పాటు కొనసాగనున్న భారత్ న్యాయ్ యాత్ర 15 రాష్ట్రాల్లో 110 జిల్లాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా కాలినడకన, బస్సులో మొత్తంగా 6,700కిపైగా కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మార్చి 20న ముంబయిలో ఈ యాత్ర ముగుస్తుంది.
మణిపూర్, నాగాలాండ్ మీదుగా జనవరి 18 నాటికి ఈ యాత్ర అసోంకి చేరుకుంటుంది. ఆదివారం రాత్రికి మణిపూర్ సరిహద్దులోని ఖుజామా గ్రామంలో రాహుల్ బస చేయనున్నారు. సోమవారం ఉదయం అక్కడి నుంచి నాగాలాండ్‌లోకి ప్రవేశించి ఆ రాష్ట్ర రాజధాని కోహిమాలో భారీ ర్యాలీని చేపడతారు.
ఇది ఎన్నికల కోసం చేస్తున్న యాత్ర కాదని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేసింది. దేశంలో వెనుకబడిన వర్గాలు గొంతుకను వినిపించేందుకే రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపడుతున్నట్టు తేల్చి చెప్పింది. అందరికీ న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించింది.
మణిపూర్‌లోని జరిగిన జోడో న్యాయ్ యాత్ర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. పొగమంచు కారణంగా హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఇబ్బంది ఎదురవ్వడంతో యాత్ర ఆరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక, జోడో యాత్ర గీతాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల కిందట విడుదల చేసింది.
ప్రారంభ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ రాష్ట్ర పాలిత సీఎంలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కాగా, ఏపీ నుంచి రఘువీరారెడ్డి, వైఎస్ షర్మిల హాజరయ్యారు.
తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా, న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. బస్సులతో పాటు అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని వివరించారు.
“పీఎం మోడీ ఓట్లు అడగడానికి మణిపూర్‌కి వస్తాడు కానీ మణిపూర్ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ‘వో సమందర్ కే ఊపర్ సైర్ కర్తా ఫిర్తా హై ఔర్ బైతే జగహ్ జప్ కర్తే హే రామ్ రామ్’ అని మొహం చూపించడు. ముఖ్ మే రామ్, బగల్ మే చూరీ, ప్రజలతో ఇలా చేయొద్దు. ప్రతి ఒక్కరికి దేవుడిపై నమ్మకం ఉంది కానీ ఓట్ల కోసం ఇలా చేయకండి. ప్రజలను రెచ్చగొట్టేందుకు ఈ వ్యక్తులు (బీజేపీ) మతాన్ని మిళితం చేస్తున్నారు” అని మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా హెచ్చరించారు.