దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరోసారి విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థిితి ఏర్పడింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితకు సమన్లను జారీ చేశారు.
మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చారు. విచారణలో భాగంగా ఉదయం తమ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని సూచించారు. అయితే సుప్రీంకోర్టులో ఈ కేసు విషయమై తాను దాఖలు చేసిన పిటీషన్ గురించి తేలేవరకు తాను విచారణకు హాజరుకాబోమని కవిత స్పష్టం చేశారు. ఆ మేరకు ఆమె ఈడీకి లేఖ కూడా వ్రాసారు.
ఈ కేసులో కల్వకుంట్ల కవిత ఇదివరకు దర్యాప్తును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెండు సార్లు ఆమె ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. విచారణకు హాజరయ్యారు.
ఆ తరువాత ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో విచారణ నెమ్మదించినట్టే కనిపించింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కవితకు ఈడీ సమన్లు అందలేదు. లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి బీఆర్ఎస్ సిద్ధమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో- మళ్లీ ఈడీ అధికారులు కవితకు సమన్లు ఇవ్వడం అటు రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేదు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో కవిత ఈడీ సమన్లను అందుకోవడం చర్చనీయాంశమౌతోంది.
గతంలో ఇదే ఈడీ అధికారులు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలనూ విచారించిన విషయం తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్కు బాసటగా నిలిచింది బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్కు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విచారణను ఎదుర్కొంటున్నారు. ఏడాది కాలంగా ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్లన్నింటినీ కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.