ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు కల్పించారు. తెలంగాణ వేదికగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని రెండేళ్ళ క్రితం స్థాపించిన వైఎస్ షర్మిల కొద్దిరోజుల కిందటే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్లో చేరుతారని బావించినా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి ఉండేలా ఆమెను ఒప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిన నెల రోజుల్లోపే ఢిల్లీ వేదికగా ఆమె హస్తం కండువా కప్పేసుకున్నారు. తాజాగా ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.
ఇప్పటి వరకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి బాధ్యతలు చూసిన గిడుగు రుద్రరాజు సోమవారం తన పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పీసీసీ పదవికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ పంపారు. అమలాపురం పట్టణానికి చెందిన గిడుగు రుద్రరాజు 2022 నవంబరులో ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు.
గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన నేపథ్యంలో వైఎస్ షర్మిల కోసమే తప్పుకున్నారని ప్రచారం జరిగింది. అంతా భావించినట్టే పదవి నుంచి తప్పుకున్న 24గంటల్లోనే షర్మిలకు బాధ్యతలు అప్పగించారు.
నిన్న, మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న షర్మిల ఇకపై ఆంధ్రా రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కుమారుడి వివాహం తర్వాత షర్మిల పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నారు. ప్రస్తుతం 49 ఏళ్ల వైఎస్ షర్మిల దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోదరి అవుతారు.