ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలే ప్రజా సేవకులని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో నెలకొల్పిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్)ని ప్రధాని మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.
పరిపాలనా దక్షతకు శ్రీరాముడు మారుపేరు అని, ఆయన పాలన ఇప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని చెబుతూ రామరాజ్యం మనందరికీ ఆదర్శప్రాయం అని ప్రధాని తెలిపారు. రామరాజ్యం గురించి మహాత్మాగాంధీ అనేక సార్లు ప్రస్తావించారు. ప్రజలకు సుపరిపాలన అందాలని గాంధీ చెప్పారని గుర్తు చేసారు.
ఐఆర్ఎస్ అభ్యర్థుల శిక్షణ కోసం రూ 900కోట్లతో పాలసముద్రం వద్ద నాసిన్ క్యాంపస్ నిర్మించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా ప్రధాని అనంతరం సీఎం జగన్ తో కలిసి భవనాలను పరిశీలించారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో ప్రధాని మోదీ ముఖాముఖిగా మాట్లాడారు..
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగిస్తూ చారిత్రక ప్రదేశంలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని చెప్పారు. నాసిన్ను ప్రారంభించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కోసం 11 రోజుల అనుష్టానం చేస్తున్నట్లు చెప్పారు. రాముడి జీవితం, ఆయన స్ఫూర్తి, విశ్వాసం భక్తి పరిధిని మించినవన్నారు. రాముడు సాంఘిక జీవితంలో సుపరిపాలనకు ఒక ప్రతీక అని, అతను యావత్ దేశానికి గొప్ప ప్రేరణగా మారగలడని మోదీ చెప్పుకొచ్చారు.
మరోవైపు పుట్టపర్తి సత్యసాయిబాబ జన్మస్థలం, లేపాక్షిలో వీరభద్ర మందిరం దర్శించుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని తెలిపారు. రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పారని పేర్కొన్నారు. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదని, జీఎస్టీ తీసుకువచ్చి పన్నులను సరళతరం చేశామని మోదీ తెలిపారు.
ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికే వాడాలని, ఇదే రామరాజ్య సందేశమని ప్రధాని తెలిపారు. తాము తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల పన్నులు చెల్లించే వారి సంఖ్య నానాటికి పెరుగుతుందని పేర్కొన్నారు. పదేళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతుందని, అనేక కార్యక్రమాల వల్ల మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతుందని మోదీ వివరించారు.
పేదలు, రైతులు, మహిళలు,యువకుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతూ పేదలకు ప్రభుత్వాలు సహకారమందిస్తే పేదరికం దూరమవుతుందని చెప్పారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని ప్రధాని తెలిపారు.
కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ నాసిన్ కేంద్రం ఏపీలో ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు.మోదీ బిజీ షెడ్యూల్ లో కూడా ఏపీకి వచ్చి.. నాసిన్ భవనాలను జాతికి అంకితం చేయడం అదృష్టమని పేర్కొన్నారు. 2014లో అప్పటి ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం నాసిన్ కేంద్రం ఏర్పాటుకు మంచి సహకారం అందించారని ఆర్ధిక మంత్రి ప్రశంసించారు.