ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా ఉల్లంఘనపై కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాల మధ్య “నిందల ఆట”, “మాటల యుద్ధం” అని సుప్రీం కోర్టు ధ్వజమెత్తిన రోజున, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాంగ్రెస్, పంజాబ్ లోని ఆ పార్టీ ప్రభుత్వంపై “ముందుగా వేసుకున్న పధకం” ప్రకారం జరిగిన “కుట్ర”గా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.
కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ సహితం ప్రధాని భద్రతా ఉల్లంఘనలు కాంగ్రెస్ లో ఎవ్వరికీ ప్రయోజనకరం? అంటూ ప్రశ్నించడం గమనార్హం. కనీసం ఇద్దరు ముఖ్యమంత్రులు, హిమంత బిస్వా శర్మ (అస్సాం) బిప్లబ్ కుమార్ దేబ్ (త్రిపుర), “ఖలిస్థానీల” ప్రమేయం ఉందని ఆరోపించారు, ప్రధానమంత్రిని “హత్యకు కుట్ర” చేసినందుకు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని అరెస్టు చేయాలని శర్మ డిమాండ్ చేశారు. .
నలుగురు ముఖ్యమంత్రులు, యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), శర్మ, దేబ్, ప్రధానమంత్రి కాన్వాయ్ చిక్కుకుపోయిన ఫ్లైఓవర్ “పాకిస్తాన్ సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో” ఉందని, “డ్రోన్లు, క్షీపనులు, స్పిన్నర్ల బారిన పడే అవకాశం ఉందని” ఆరోపించారు. భద్రతా ఉల్లంఘనపై ఇండియా టుడే న్యూస్ ఛానెల్ చేసిన “స్టింగ్ ఆపరేషన్”పై ముఖ్యమంత్రులు స్పందించారు.
డిసెంబర్ 31 నుండి జనవరి 4 మధ్య (ఒక రోజు ముందు) పంజాబ్ అదనపు డిజిపి (లా అండ్ ఆర్డర్) నరేష్ అరోరా రాసిన వరుస లేఖలలో ప్రధానమంత్రి ర్యాలీకి అంతరాయం కలిగించడానికి నిరసనకారులు రోడ్లను దిగ్బంధించే అవకాశం ఉందని జిల్లా ఎస్ ఎస్ పిలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులకు వ్రాసిన కొన్ని లేఖలను ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సమీక్షించింది. నిరసనకారులు రోడ్లను దిగ్బంధించవచ్చని పోలీసు అధికారులను ఆ లేఖలు స్పష్టంగా హెచ్చరించాయి. ఫిరోజ్పూర్లో ప్రధాని పర్యటన కోసం భద్రతా ఏర్పాట్లు చేయాలని వారిని కోరారు.
ఫిరోజ్పూర్లో ప్రధాని పర్యటనకు నిరసనకారులు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అరోరా లేఖలతో పాటు, రంగంలోని ఇంటెలిజెన్స్ అధికారులు సీనియర్ అధికారులకు కూడా సమాచారం అందించారని ఇండియా టుడే నివేదిక పేర్కొంది. ఈ సమాచారంపై పంజాబ్ డిజిపి వీరేష్ కుమార్ భవ్రా, పంజాబ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎఎస్ రాయ్ వ్యాఖ్యానించడానికి అందుబాటులో లేరు. భద్రతా లోపంతో ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీ హర్మన్దీప్ హన్స్ శుక్రవారం లూథియానాకు బదిలీ చేయడం గమనార్హం.
గౌహతిలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, కాంగ్రెస్ హైకమాండ్, పంజాబ్‌లోని దాని ప్రభుత్వం “అంతర్జాతీయ కుట్ర”లో “నేరుగా ప్రమేయం” కలిగి ఉన్నాయని, రోడ్డును అడ్డుకున్న నిరసనకారులు “ఖలిస్తానీలు” అని, వారు రైతులు కాదని శర్మ ఆరోపించారు.
ఈ ఘటన పాకిస్థాన్-పంజాబ్ సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే చోటు చేసుకుంది. “ఇది డ్రోన్లు, క్షిపణులు, స్నిపర్ల పరిధిలో ఉందని అర్థం… పంజాబ్ ప్రభుత్వం ప్రధానమంత్రిని రక్షించలేదు, కానీ ఆయనను చంపడానికి కుట్ర పన్నింది,” అని ధ్వజమెత్తారు. ఈ ఉదంతంపై “న్యాయమైన, తటస్థ దర్యాప్తు” జరపాలని అస్సాం ముఖ్యమంత్రి డిమాండ్ చేశాడు.
ఢిల్లీలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలా అన్నారు: “ఇది ముందే రూపొందించిన కుట్ర అని స్పష్టమైంది. పంజాబ్ ప్రభుత్వం ఎస్ పి జి బ్లూ బుక్‌లో పేర్కొన్న నియమాలు, ప్రోటోకాల్‌ను పాటించలేదు. ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి, డిజిపి స్వీకరించే ప్రాథమిక ప్రోటోకాల్‌ను కూడా వారు పాటించలేదు. ఇది కేవలం భద్రతా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమే కాకుండా దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర. దీనికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి”. .
ప్రధానమంత్రి కాన్వాయ్‌ని డ్రోన్లు లేదా ఇతర దాడులకు గురిచేసే ప్రదేశంలో నిలిపివేసినట్లు చెబుతూ, “ఖలిస్తానీ ప్రమేయం గురించి ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు ఉన్నప్పటికీ” ఇది జరిగిందని ఆదిత్యనాథ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భద్రతా ఉల్లంఘన “ముందస్తు ప్రణాళిక”, “ప్రాయోజిత కుట్ర” అని ఆరోపించారు.
“ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ ప్రధానితో ఎందుకు లేరు? ఏమి జరుగుతుందో వారికి తెలుసు అని ఇది చూపడం లేదా? నిరసనకారులకు ప్రధాని మార్గాన్ని ఎవరు వెల్లడించారు? పోలీసులు ఉన్నప్పటికీ ఇంత తక్కువ సమయంలోనే ఇంత పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఎలా గుమిగూడారు? మార్గమంతా సురక్షితంగా ఉందని డీజీపీ పీఎం సెక్యూరిటీ బృందానికి ఎందుకు చెప్పారు?” అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
ఫోన్ కాల్లకు కూడా చన్నీ స్పందించలేదని చౌహాన్ ఆరోపించారు. “బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన కాల్లకు కూడా సమాధానం లేదు. ఈ కుట్రకు కాంగ్రెస్ హైకమాండ్‌తో ముడిపడి ఉన్నట్లు చూపుతోంది’’ అని ఆయన ఆరోపించారు. “ప్రదాని కాన్వాయ్ ఇరుక్కుపోయిన ఫ్లైఓవర్ పాకిస్తాన్ సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, దాని చుట్టూ ఎత్తైన శిఖరాలు, చెట్లు ఉన్నాయి. ఏదైనా సంఘటన జరిగితే దానికి ఎవరు బాధ్యులు?” అని చౌహాన్ నిలదీశారు.
“నరేంద్ర మోదీని ద్వేషించే ప్రక్రియలో కాంగ్రెస్ దేశం, ప్రధాని పదవి, రాజ్యాంగం, సైన్యం, భద్రత, జాతీయ ప్రయోజనాలపై ద్వేషాన్ని పెంచుకుంది” అని ఆయన మండిపడ్డారు. అగర్తలాలో, భద్రతా ఉల్లంఘన “ముందస్తు ప్రణాళికతో, ప్రధానమంత్రి జీవితాన్ని ప్రమాదంలో పడేసే కుట్రలో భాగం” అని దేబ్ ఆరోపించారు.
“భారత వ్యతిరేక భావాలను పెంపొందించే ఖలిస్తానీ సంస్థలు భద్రతా ఉల్లంఘనలో పాల్గొన్నాయి. కాంగ్రెస్ నాయకులు స్పందించిన తీరు మొత్తం సంఘటనను కాంగ్రెస్ హైకమాండ్ స్పాన్సర్ చేసిందని స్పష్టం చేస్తుంది” అని ఆయన ఆరోపించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా “నిర్లక్ష్యం”, “భారీ కుట్ర” అని ఆరోపించారు. “ఇది కేవలం పొరపాటు కాదు, భారీ కుట్ర అని చెప్పవచ్చు. వారు ప్రధానమంత్రికి హాని కలిగించడానికి ప్రయత్నించిన విధానం, ఇది యాదృచ్ఛికమైనది కాదు, ముందస్తుగా, ప్రాయోజిత కుట్ర. కాంగ్రెస్ హైకమాండ్ సమాధానం చెప్పాలి’ అని ఆయన పేర్కొన్నారు.
హర్యానాలో, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, “స్టింగ్ ఆపరేషన్” సాధ్యమైన అంతరాయాలపై ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు ఉన్నప్పటికీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి బదులుగా “మార్గాలను ఎలా నిరోధించాలో రైతు నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది” అని తేలింది. “పంజాబ్ ప్రభుత్వానికి ఇది చాలా అవమానకరం. ప్రధాని ప్రాణాలకు ముప్పు తెచ్చిన తీరు అత్యంత ఖండనీయం’’ అని మండిపడ్డారు.
ఇదిలావుండగా, ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ నేత స్మృతి ఇరానీ మాట్లాడుతూ, భద్రతా ఉల్లంఘన “ఉద్దేశపూర్వకంగా” జరిగిందని బిజెపి ఆరోపణను పునరుద్ఘాటించారు.
“కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం (పంజాబ్‌లో) క్రియాశీల సహకారంతో ఉద్దేశపూర్వకంగా ప్రధాని భద్రతా చర్యలను ఎందుకు ఉల్లంఘించారు? కాంగ్రెస్ పార్టీలో ఈ ఉల్లంఘన ద్వారా లబ్ధి పొందాలని ఎవరు ప్రయత్నించారు? పంజాబ్ ప్రభుత్వంలో ఎవరు ఉద్దేశపూర్వకంగా ప్రధాని భద్రతకు బెదిరింపులను విస్మరించారు?” అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ హైకమాండ్ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.