జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో.. రామ్ లల్లా విగ్రహాన్ని బుధవారం అర్ధరాత్రి గర్భగుడిలోకి తరలించిన విషయం తెలిసిందే. ఇక గురువారం నాడు రామ్ లల్లా విగ్రహానికి సంబంధించిన ఒక ఫొటో బయటకు వచ్చింది.
గర్భగుడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముసుగుతో కప్పి ఉన్న విగ్రహం, మొదటి ఫోటోను ఆవిష్కరించారు. ఈ ఫొటోలను విశ్వహిందూ పరిషత్ మీడియా ఇన్ఛార్జి శరద్ శర్మ షేర్ చేశారు. ఐదు తరాల ప్రసిద్ధ శిల్పుల కుటుంబ నేపథ్యం కలిగిన మైసూరు వాసి చెక్కిన 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని బుధవారం ఆలయానికి తీసుకువచ్చారు.
వైదిక బ్రాహ్మణులు, ఆచార్యులు ఆలయ పవిత్ర ప్రాంగణంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర సభ్యులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారని విశ్వహిందూ పరిషత్ తెలిపింది.
గురువారం మధ్యాహ్నం రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచినట్లు ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించిన పూజారి అరుణ్ దీక్షిత్ మీడియాకు తెలిపారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా ‘ప్రధాన సంకల్పం’ నిర్వహించారని అరుణ్ దీక్షిత్ తెలిపారు.
అందరి సంక్షేమం కోసం, దేశ సంక్షేమం కోసం, మానవాళి సంక్షేమం కోసం, ఈ పనికి సహకరించిన వారి కోసం శ్రీరాముడి ప్రతిష్ఠ జరుగుతోందనేది ‘ప్రధాన సంకల్పం’ వెనుక ఉన్న ఆలోచన అని అరుణ్ దీక్షిత్ పేర్కొన్నారు. ఇతర ఆచారాలు, సంప్రదాయాలను కూడా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. బ్రాహ్మణులకు వస్త్రాలు కూడా ఇచ్చామని, అందరికీ పనులు అప్పగించామని తెలిపారు.
జనవరి 22న అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం ప్రధాన పూజలు నిర్వహించనుంది. ఈ వేడుకకు అనేక మంది ప్రముఖులను కూడా ఆహ్వానించారు. జనవరి 23న ఆలయాన్ని ప్రజల సందర్శనార్థం తెరవనున్నారు.