రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లోపు సగం ఐరోపాకు కరోనా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతం వరకు మొత్తం ఒమిక్రాన్ వ్యాపిస్తుందని తెలిపింది. 2022 తొలి వారంలో 70 లక్షల మందికి కరోనా సోకడాన్ని ఆధారంగా చేసుకుని ఈ అంచనాలను లెక్కగట్టారు.
ఐరోపా ఖండంలో ఇన్ఫెక్షన్ సోకిన వారి సంఖ్య రెండు వారాల్లో రెట్టింపైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ హన్స్ క్లూగ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కనీసం 50 శాతం మంది ప్రజలు అత్యధికంగా ఎనిమిది వారాల్లోపు ఒమిక్రాన్ బారినపడే అవకాశం ఉందని అమెరికా లోని సియాటెల్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మ్యాట్రిక్స్ అండ్ ఇవల్యూషన్ అంచనా వేసినట్టు వెల్లడించారు.
ఐరోపా, మధ్య ఆసియా దేశాలపై ఒమిక్రాన్ ఒత్తిడి కొనసాగుతోందని డాక్టర్ హన్స్ క్లూగ్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక మరణాల రేటు నమోదవుతున్న దేశాల్లో ఐరోపా లోని పోలాండ్ ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కనీసం 40 శాతం మందికి ఎటువంటి వ్యాక్సిన్లు అందలేదు.
గత వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు అంతగా లేకపోయినప్పటికీ, కొత్త కేసులు 55 శాతం అంటే దాదాపు 15 మిలియన్ వరకు పెరిగాయని, మరణాలు 43,000 వరకు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఆగ్నేయాసియాలో కొత్త కేసులు 400 శాతం వరకు అమాంతంగా పెరిగిపోవడం విశేషం.
భారత్, తిమోర్ లెస్టే, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లో కేసులు భారీ సంఖ్యంలో పెరిగాయి. ఆగ్నేయాసియాలో 6 శాతం వరకు మరణాలు తగ్గాయి. ఆఫ్రికాలో 11 శాతం వరకు కేసులు తగ్గుముఖం పట్టగా మిగతా రీజియన్లలో కొత్త కేసులు పెరిగాయని పేర్కొంది. బ్రిటన్, అమెరికా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని తరువాతి దశ ఏ విధంగా ఉంటుందో చెప్పలేమన్నారు.
ఈ వారం అమెరికాలో 78 శాతం , ఐరో పా దేశాల్లో 31 శాతం వరకు కరోనా కొత్త కేసులు పెరిగాయని, మరణాలు 10 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్ అత్యధిక వ్యాప్తితో రష్యాలో కరోనా కొత్త కేసుల ఉప్పెన ముంచుకు వస్తోందని, ఇప్పుడు తామంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని బుధవారం ఉన్నత స్థాయి అధికార వర్గాల సమావేశంలో రష్యా ప్రధాని పుతిన్ వెల్లడించారు.
ఈ పరిస్థితి నుంచి దేశం బయటపడేందుకు ఆరోగ్య భద్రతా వ్యవస్థ ఉద్యమించాలని ఆయన సూచించారు. రష్యాలో సోమవారం 15,000 కేసులు నమోదు కాగా, మంగళ, బుధవారాల్లో 17,000 వరకు కేసులు పెరిగాయని రష్యా కరోనా టాస్క్ ఫోర్స్ వెల్లడించింది.