ముగ్గురిని ప్రభుత్వ సలహాదారులను తెలంగాణ ప్రభుత్వంనియమించింది. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, హరకర వేణుగోపాల్ లను సలహాదారులుగా ప్రకటించింది. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుగా నరేందర్ రెడ్డిని నియమించగా, ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ శాఖలకు సలహాదారుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీని నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ డిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎంపీ డా. మల్లు రవిని నియమించారు. గతంలో ఎంపీగా, ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆయన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోదరుడు. ప్రోటోకాల్, ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా హర్కార వేణుగోపాల్ రావును నియమించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌తో నరేందర్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇద్దరూ కలిసి పని చేశారు. 2004- 2009 మధ్యలో నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా రేవంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. అప్పట్నుంచే ఇద్దరి మధ్య స్నేహం బలపడుతూ వచ్చింది.
నరేందర్ ను 2015లో ఎమ్మెల్సీగా గెలిపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అనంతర కాలంలో రేవంత్ రెడ్డి వెంటే ఉన్నారు నరేందర్ రెడ్డి. ఆ తర్వాత రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచీ పలు కార్యక్రమాల్లో నరేందర్ క్రియాశీలకంగా ఉంటున్నారు.
ఇటీవలి ఎన్నికల సమయంలోనూ పీసీసీ అధ్యక్షుడి ప్రచారంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో నరేందర్ కు అవకాశం దక్కింది. ఇకపై ఆయన సీఎం రేవంత్ సలహాదారుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఇక మరో సీనియర్ నేత షబ్బీర్ అలీ కూడా సలహాదారుడిగా నియమితులయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని అంతా భావించినప్పటికీ అవకాశం దక్కలేదు. పైగా, ఎమ్యెల్యేగా ఓటమి చెందారు. దీంతో మంత్రివర్గంలో చేర్చుకొని అవకాశం లేకపోవడంతో ఆయన్ను సలహాదారునిగా నియమించారు. ఈ నలుగురికి కేబినెట్ హోదాతో కూడిన ప్రొటోకాల్ అమలు కానున్నాయి.