రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష లడ్డూ ప్రసాదాలను కానుకగా పంపించిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ పంచిపెడుతున్నది.
ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు. ప్రతి ఒక్కరికీ రెండు శ్రీవారి ప్రసాదంగా అందిస్తుంది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్- 1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో రెండు చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానంలో అవి అయోధ్యకు చేరుకున్నాయి.
వాటిని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అందజేశారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆహ్వానితులకు లడ్డూ ప్రసాదాలను పంచి పెట్టే కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీనికోసం అయోధ్యకు చేరుకున్నారు. లడ్డూ పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు.