మన రాముడు మళ్లీ వచ్చాడని, గుడారం కింద ఉన్న రాముడు దివ్వమైన మందిరంలోకి వచ్చాడని, ఈ రోజు దేశానికి ఎంతో శుభదినమని అయోధ్య మందిర ప్రాణప్రతిష్ఠ అనంతరం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రోజు కోసం ఎన్నో వందల ఏళ్లుగా ఎదురు చూశామని, ఇన్నాళ్లకు ఈ కల సాకారమైందని చెప్పారు.
భారతీయులు బానిస మనస్తత్వం వదిలి సగర్వంగా తలెత్తుకుని చూస్తున్నారని, ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉందని ప్రధాని చెప్పారు. పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని, ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నానని మోదీ పేర్కొన్నారు. ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారని, స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని మోదీ ప్రధాని చెప్పారు.
దేశమంతా నేడు దీపావళి జరుపుకుంటోందని, ఈ రాత్రికి ప్రతి ఇంటా దీపాలు వెలగాలని ప్రధాని అభిలషించారు. రాముడి రూపంలో దేశం చైతన్య మందిరంగా మారిందని ప్రధాని మోదీ తెలిపారు. రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాల పాటు న్యాయ పోరాటం సాగిందని, న్యాయమైన తీర్పును ఇచ్చిన న్యాయవ్యవస్థకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
త్రేతాయుగంలో రాముడు 14 ఏళ్ల వనవాసంతో దూరం అయ్యాడని, కానీ ఈ యుగంలో దేశ ప్రజల నుంచి అయోధ్య కొన్ని వందల ఏళ్ల పాటు దూరమైందని పేర్కొన్నారు. ఈ ఎడబాటును దేశ ప్రజల్ని ఎంతో వేదనకు గురి చేసిందని తెలిపారు. భవ్య భారత్, వికసిత భారత్కు ఈ అయోధ్యా మందిరం ఆధారంగా నిలుస్తుందని, భారత్ ఇప్పుడు ముందుకు వెళ్తుందని, అభివృద్ధిలో అగ్రపథానికి చేరుకుంటామని ప్రధాని తెలిపారు.
రాముడు త్యాగనిరతికి, ధర్మానికి ప్రతీకని, సమన్వయం చేసుకుని ముందుకెళ్లడమే మన ధర్మం అని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. 500 ఏళ్లుగా అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నామని, ఎందరో ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేసుకున్నారు. మనిషికి అత్యాశ ఉండకూడదని, నాగరికుడు అంటే క్రమశిక్షతో ఉండటమే అని చెప్పారు.
ఆలయ నిర్మాణంతో 500 ఏళ్ల కల నెరవేరిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఎన్నో పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైందని, ఈ క్షణం కోసం దేశమంతా ఎన్నో ఏళ్లు ఎదురుచూసిందని తెలిపారు. ఈ ఘట్టాన్ని తాను మాటల్లో వర్ణించలేనని, ప్రాణప్రతిష్ఠతో దేశమంతా రామమయంగా మారిందని చెప్పారు.
ప్రధాని మోదీ దూరదృష్టి, అంకిత భావంతోనే ఇదంతా సాధ్యమైందని, అయోధ్యకు పూర్వ వైభవం తెచ్చేందుకు రూ.వందల కోట్లు కేటాయించారని యోగి వెల్లడించారు.
అయోధ్యలోని రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పదకొండు రోజుల ఉపవాస దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రతువు దిగ్విజయంగా పూర్తికావడంతో మోదీ ఉపవాస దీక్షను పూర్తిచేశారు. మోదీతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద గిరి స్వామీజీ తీర్థం ఇచ్చి ప్రధానితో దీక్షను విరమింపజేశారు.
