అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకను అట్టహాసంగా నిర్వహించిన అనంతరం ఢిల్లీకి తిరిగి రాగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద ఓ కోటి కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు లభిస్తాయని మోదీ చెప్పారు.
“భారతీయుల ఇళ్లపై వారి సొంత సోలార్ రూఫ్ టాప్ సిస్టెమ్ ఉండాలన్న నా సంకల్పం. ఈరోజు అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మరింత బలపడింది. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది,” అని మోదీ ప్రకటించారు.
“పేద, మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ బిల్లులను తగ్గించడానికి ఈ పథకం సహాయపడుతుందని ప్రధాని మోడీ అన్నారు. దీనికి తోడు గా.. మధ్యతరగతి కూడా ఇంధన రంగంలో భారత్ ను స్వయం సమృద్ధి సాధించేలా చేస్తుంది,” అని మోదీ తెలిపారు.
కొత్త పథకం విషయంలో నూతన, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ మంత్రిత్వ శాఖల అధికారులు మోదీ సోమవారం సమావేశమయ్యారు. రూఫ్ టాప్ సోలార్ను పెద్ద సంఖ్యలో అవలంబించేలా రెసిడెన్షియల్ వినియోగదారుల కోసం జాతీయ ప్రచారాన్ని ప్రారంభించాలని ఈ సమావేశంలో మోదీ అధికారులను ఆదేశించారు.
రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ ఇంకా ఊపందుకోని సమయంలో ఈ పథకం రావడం గమనార్హం. 2022 చివరి నాటికి 40 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 5.87 గిగావాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులను మాత్రమే ఏర్పాటు చేశారని, ఇది ఆశించిన లక్ష్యంలో 15% కంటే తక్కువని.. గత ఏడాది మేలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ తెలిపింది.