అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మహోత్తర ఘట్టం పూర్తి కావడంతో తెలంగాణలోని రామ భక్తుల కోసం బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా రామ భక్తులను ఉచితంగా అయోధ్య రామయ్య దగ్గరకు తీసుకెళ్తేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. జనవరి 29 నుంచి తెలంగాణ నుంచి అయోధ్యకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
తెలంగాణలోని ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మంది చొప్పున అయోధ్యకు తీసుకెళ్లనున్నారు బీజేపీ నేతలు. ఈ స్పెషల్ ట్రైన్లలో 20 బోగీలుండనున్నాయి. దీంత ఒక్కో రైలులో సుమారు 1,400 మంది భక్తులు ప్రయాణించే అవకాశం ఉంది. ఒక్కో బోగీకి ఒక్కో ఇంఛార్జ్ ఉండనున్నారు. కాగా అయోధ్య యాత్రకు వెళ్లి రావడానికి 5 రోజుల సమయం పడుతుందని బీజేపీ నేతలు చెప్తున్నారు.
జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు 17 రోజుల పాటు ఈ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నారు. అయితే, ఈ ప్రత్యేక రైళ్లన్నీ సికింద్రాబాద్, కాజీపేట రైల్వే స్టేషన్ల నుంచి మాత్రమే అయోధ్యకు బయలుదేరనున్నాయి. సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన భక్తులంతా సికింద్రాబాద్‌లో అందుబాటులో ఉండే ప్రత్యేక రైళ్లు ఎక్కాల్సి ఉంటుంది.
ఇక.. మిగిలిన నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్.. నియోజకవర్గాలకు చెందిన భక్తులు కాజీపేట స్టేషన్లో ఆయా తేదీల్లో అందుబాటులో ఉండే రైళ్లలో ఎక్కాల్సి ఉంటుంది.
మరోవంక, అయితే ఏపీ నుంచి అయోధ్య రామ మందిరం సందర్శించే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఫిబ్రవరి 7,10,11,14 తేదీలలో ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను సామర్లకోట, రాజమండ్రి రైల్వే స్టేషన్ల నుంచి నడుపుతున్నట్లు రైల్వే ట్రాన్స్‌పోర్టేషన్ అధికారి కార్యాలయం తెలిపింది.
రాజమండ్రి- అయోధ్య మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు (07217) ఫిబ్రవరి 7న బుధవారం బయలుదేరనుంది. ఈ రైలు రాజమండ్రిలో ఫిబ్రవరి 7న బుధవారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా అయోధ్యడామ్కు శుక్రవారం రాత్రి 11.00కి చేరుతుంది.
అయోధ్య డామ్- రాజమండ్రి మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు (07217) ఫిబ్రవరి 10న శనివారం బయలుదేరనుంది. ఈ రైలు అయోధ్య డామ్‌లో ఫిబ్రవరి 10న శనివారం రాత్రి 11 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి చేరుతుంది.
సామర్లకోట-అయోధ్య మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు (07218) ఈ నెల 11న బయలుదేరనుంది. ఈ రైలు సామర్లకోటలో ఆదివారం రాత్రి 6.30 గంటలకు బయలుదేరి అన్నవరం, తుని, దువ్వాడ, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా అయోధ్యడామ్కు మంగళవారం ఉదయం 10.35కి చేరుతుంది. మొత్తం 1,870 కిలోమీటర్ల దూరాన్ని ఈ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు 40.05 గంటల పాటు ప్రయాణిస్తుంది.
మరోవైపు గుంటూరు- అయోధ్య- గుంటూరు (07215), విజయవాడ-అయోధ్య-విజయవాడ (07216) మరో రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. గుంటూరు నుంచి ఈ నెల 31న, విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న ఈ రైళ్లు వెళతాయి. విజయవాడ నుంచి ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ల మీదుగా అయోధ్యకు రైళ్లు వెళ్లనున్నాయి.
అయోధ్య- సామర్లకోట మధ్య ప్రత్యేక రైలు (07218) ఫిబ్రవరి 14న బుధవారం రాత్రి 7.55కి బయలుదేరనుంది. ఈ రైలు అయోధ్య డామ్‌లో బుధవారం రాత్రి 7.55కి బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం 1.00 గంటకు చేరుతుంది. మరిన్ని వివరాలకు సమీప రైల్వే స్టేషన్ బుకింగ్ అధికారులను సంప్రదించాలని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.