గత 42 రోజులుగా సమ్మె చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ సిబ్బంది సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయని, సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సోమవారం సాయంత్రం లోపు విధుల్లో చేరాలని డెడ్ లైన్ విధించింది. లేదంటే ఉద్యోగుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.
కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అంగన్వాడీలను డ్యూటీ నుంచి తొలగిస్తున్నామని సర్క్యులర్ కూడా జారీ చేశారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అంగన్వాడీ సంఘాలను అత్యవసర చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది.
మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , మహిళా శిశు సంక్షేమశాఖ డైరక్టర్ జయలక్ష్మి పాల్గొన్నారు. అంగన్వాడీ సంఘాల తరపున మూడు సంఘాల నేతలు హాజరయ్యారు. రాత్రి 11.30 గంటల వరకు జరిగిన చర్చల్లో అంగన్వాడీలపై పెట్టిన కేసులన్నింటిని ఎత్తివేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.
కక్ష సాధింపు చర్యలుండబోవని, విధుల నుంచి అంగన్వాడీ ఉద్యోగుల తొలగింపు చర్యలు నిలిపివేస్తామని, అందరినీ కొనసాగిస్తామని చెప్పింది. సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తామని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తామని ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగ విరమణ ప్రయోజనాల కింద అంగన్వాడీ వర్కర్‌కు రూ.1.20 లక్షలు, హెల్పర్లకు రూ.50 వేలు చెల్లించడానికి అంగీకరించింది.
మట్టి ఖర్చులకు రూ.20 వేలు, బీమా మొత్తం రూ.2 లక్షలు చొప్పున చెల్లించడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. జులై నెలలో పరస్పర అంగీకారం మేరకు వేతనాలను పెంచడానికి అంగీకరించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపజేయడానికి ఒప్పుకుంది. ఈ మేరకు కుదిరిన ఒప్పందాన్ని ఒకటి రెండు రోజుల్లో రాతపూర్వకంగాఅంగన్వాడీ సంఘాలకు అందజేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం అయ్యాయని అంగన్వాడీ ప్రతినిధులు మీడియాకు వివరించారు. ‘తమ వేతనాలను జులైలో పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గ్రాట్యూటీ ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మాట ఇచ్చింది’ అని ప్రకటించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందు వల్లే సంక్షేమ పథకాలు అమలు చేయలేదని వివరించింది.