భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్సాంలో ప్రవేశించగానే మూడు రోజులుగా అడుగడుగున అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రాహుల్ యాత్ర అస్సాంలోకి ప్రవేశించగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రూట్ మ్యాప్ మార్చుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ కారణాలతో పాటు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో రూట్ మ్యాప్ మార్పు చేసుకోవాలని తెలిపారు. గౌహతి నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు రాహుల్ యాత్రకు అడ్డుగా బారీకేడ్లను ఏర్పాటు చేశారు.
దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం బారీకేడ్లను తొలిగించి ముందుకు సాగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇదే మార్గంలో బజ్రంగ్ దళ్, బిజెపి చీఫ్ నడ్డాజీ ర్యాలీ చేపట్టారని, అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను మాత్రమే దాటమని, ఎక్కడ చట్టాన్ని అతిక్రమించలేదని స్పష్టం చేశారు.
బారికేడ్లను తొలగించటంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇది అస్సాం సంస్కృతి కాదని, మాది శాంతియుత రాష్ట్రం అని హిమంత్ తెలిపారు. నక్సలైట్ వ్యూహాలకు తాము వ్యతిరేకమని, గొడవలు జరిగేలా రాహుల్ గాంధీ రెచ్చగొట్టినందుకు అతడిపై కేసు నమోదు చేశాయని పోలీసులను ఆదేశించారు.
సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేసిన పోస్టులు సాక్ష్యాలుగా తీసుకోవాలని పోలీసులకు ముఖ్యమంత్రి సూచించారు. సోమవారం రాహుల్ ఓ దేవాలయంలోనికి వెళ్లినప్పుడు స్థానిక అధికారులు అడ్డుకున్నారు. మేఘాలయ యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి కూడా అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు.
కాగా, తన యాత్రను అణిచివేసేందుకు బీజేపీ చేపడుతున్న చర్యలు తమ పార్టీ యాత్రకు ప్రచారం కల్పిస్తున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. తమ యాత్రను దెబ్బతీసేందుకు సీఎం చేపడుతున్న చర్యలు అంతిమంగా తమకు ఉపకరిస్తాయని తెలిపారు. దేశంలో అత్యంత అవినీతి సీఎం హిమంత శర్మేనని కామ్రూప్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర నిరుద్యోగం, అవినీతి, ధరల మంట సహా పలు సమస్యలు వెంటాడుతున్నాయని పేర్కొంటూ ప్రజలు తనతో గోడు వెళ్లబోసుకున్నారని వివరించారు.