ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్టు నేత, బీహార్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ వరించింది. రాష్ట్రపతి కార్యాలయం మంగళవారంనాడు ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన చేసింది.
దివంగత నేత కర్పూరి ఠాకూర్ శతజయంతికి ఒకరోజు ముందే ఆయనకు భారతరత్న అవార్డును కేంద్రం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీహార్‌ని సమస్తిపూర్‌లో 1924 జనవరి 24న ఠాకూర్ జన్మించారు. నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆయన విద్యార్థి దశ నుంచే జాతీయోద్యమంలో పాల్గొన్నారు.
1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. అనంతరం రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ తొలిసారి 1952లో సోషలిస్ట్ పార్టీ టిక్కెట్టుపై బీహార్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1968లో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా, 1970లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పనిచేశారు. సామాజిక న్యాయం, పేదలు, దళితుల సంక్షేమానికి ఆయన విశేషంగా పాటుపడ్డారు.
1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు సోషలిస్ట్ పార్టీ/భారతీయ క్రాంతి దళ్ తరఫున ఆయన సీఎంగా పని చేశారు. మళ్లీ 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు జనతా పార్టీ తరఫున ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
లోహియా సిద్ధాంతాల పట్ల ఆయన విశేష గౌరవం కనబరచేవారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఉద్దేశించిన ‘కర్పూరి ఠాకూర్ ఫార్ములా’ను సీఎంగా ఉన్నప్పుడు ఆయన తీసుకువచ్చారు. 1978లో బీహార్‌లో బీసీలకు 26 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. జననాయక్‌గా పేరు తెచ్చుకున్నారు.
సామాజిక న్యాయం కోసం అవిరళ కృషి చేసిన జననాయక్ కర్పూరి ఠాకూర్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రకటించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కర్పూరి ఠాకూర్ శతజయంతి సందర్భంలో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం రావడం మరింత ముదావహమని పేర్కొన్నారు. దళిత వర్గాల అభ్యున్నతి పట్ల ఆయనకున్న చెక్కుచెదరని దీక్ష, సమసమాజ స్థాపనకు చేసిన కృషి స్ఫూర్తిదాయకమని తెలిపారు.