టీమ్ ఇండియా స్టార్ క్రికెట్ ప్లేయర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సుమారు దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా ఉండి రికార్డుల సునామీ సృష్టిస్తున్న కింగ్ కోహ్ మరో అరుదైన ఘనత సాధించాడు.
గతేడాదికి గాను విరాట్ ‘ఐసీసీ మెన్స్ ఓడీఐ (వన్డే) క్రికెటర్ ఆఫ్ ది ఈయర్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు ఐసీసీ గురువారం ఎక్స్ (ట్విటర్) ద్వారా ప్రకటన చేసింది. కోహ్లీకి ఈ అవార్డు రావడం ఇది నాలుగోసారి. తద్వారా కోహ్లీ ప్రపంచ క్రికెట్లో నాలుగు సార్లు ఈ అవార్డు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
గతంలో కోహ్లీ.. 2012, 2017, 2018లలో కూడా ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. భారత క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీల నుంచి గట్టి పోటీ ఎదుర్కున్నా చివరికి ఐసీసీ కోహ్లీకే ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
2023లో కోహ్లీ వన్డేలలో తన విశ్వరూపాన్ని చూపాడు. 27 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 24 ఇన్నింగ్స్‌లలో 1,377 పరుగులు చేశాడు. బౌలర్‌గా ఒక వికెట్ తీయడంతో పాటు ఫీల్డర్‌గా 12 క్యాచ్‌లు అందుకున్నాడు. అక్టోబర్ – నవంబర్‌లో భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో అయితే కోహ్లీ ఆట నెక్స్ట్ లెవల్‌కు చేరింది.
ఈ టోర్నీలో 11 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఏకంగా 765 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో కోహ్లీ మూడు సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో అతడి బ్యాటింగ్ సగటు ఏకంగా 95.62గా ఉంది. ఈ టోర్నీలో కోహ్లీ.. వన్డేలలో సచిన్ ఖాతాలో ఉన్న 49 సెంచరీల రికార్డును అధిగమించి 50 శతకాలు పూర్తిచేశాడు.
కోహ్లీతో పాటు మిగతా అవార్డులనూ ఐసీసీ తాజాగా ప్రకటించింది. గతేడాది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు రెండు ఐసీసీ ట్రోఫీలు, యాషెస్ ట్రోఫీని అందించడంలో కీలక భూమిక పోషించిన కంగారూల సారథి పాట్ కమిన్స్‌కు ‘ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్’ అవార్డు దక్కింది.
ఈ రేసులో కోహ్లీ కూడా నిలిచినా కమిన్స్‌కే వరించింది. ఆసీస్‌కే చెందిన టెస్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు ‘ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్’ అవార్డు వరించింది. 2023లో ఖవాజా.. 13 మ్యాచ్‌లలో 1,210 పరుగులు సాధించాడు. రవిచంద్రన్ అశ్విన్, జో రూట్, ట్రావిస్ హెడ్ వంటి క్రికెటర్ల నుంచి పోటీని తట్టుకుని ఖవాజా ఈ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం.
