త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందని తెలిపారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శనివారం సచివాలయంలో బిసి, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో బిసి కుల గణనపై సుదీర్ఘ చర్చ జరిగింది. బిసి కుల గణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం బిసిలకు రిజర్వేషన్లు పెంచాలని బిసి సంఘాలు చాలా కాలంగా ఉద్యమిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన నిర్వహిస్తున్నాయి. పొరుగున ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కులగణన చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కులగణన అంశాన్ని చేర్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు సంబంధించి తగు చర్యల నిమిత్తం సిఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కోరారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని చెప్పారు.
మహాత్మ జ్యోతిభా పూలే ఓవర్ సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని మరింత సమర్ధంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న దాని కంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని తెలిపారు. వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
ఎస్సి, ఎస్టి, బిసి సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేరొంటు దీంతో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత మెరుగ్గా చేసే వీలుంటుందని చెప్పారు.