పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్లో వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌ను కులం పేరుతో పాటు, అసభ్యపదజాలంలో దుషించాడని గొంది రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. చింతలపూడి ఏపీ సునీల్ కుమార్ సొంతగ్రామం. రాజు ఫిర్యాదుతో రఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని చింతలపూడి పోలీసులు తెలిపారు.
తనపై జార్ఖండ్ వ్యక్తులతో హత్యాయత్నం చేస్తున్నారని, అన్ని వివరాలతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ వ్రాస్తున్నానని ఆయన ప్రకటించిన రోజుననే ఈ కేసు నమోదు కావడం గమనార్హం. రెండు రోజుల క్రితం, హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లి రఘురామకు నోటీసులు ఇచ్చారు.
గతంలో ఉన్న కేసుల నేపథ్యంలో రఘురామ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఏ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారన్న విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా రఘురామను అరెస్టు చేయొద్దని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనను అరెస్టు చేసే అవకాశం లేదు. గతంలో ఉన్న కేసులకు సంబంధించి రఘురామ విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
నోటీసులిచ్చిన తర్వాత రఘురామ సీఐడీ అధికారి సునీల్ కుమార్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని, గొంది రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు.
మరోవంక, వైసిపి ప్రభుత్వం తన పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నందున సంవత్సరంకు పైగా తన నియోజకవర్గంకు వెళ్లలేక పోయారు. సంక్రాంతి పండుగ రోజు వెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత సిఐడి పోలీసులు నోటీసు పంపడంతో తన పర్యటనను రద్దు చేసుకున్నారు.