ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. గడచిన మూడు రోజులుగా రేట్లలో పెరుగుదల కొనసాగుతూనే ఉంది. మూడు రోజుల కిందట అమాంతం క్రూడ్ ఆయిల్ రేట్లు 3 శాతం మేర పెరిగాయి. దీనికి కొనసాగింపుగా నేడు సైతం చమురు ధరలు అంతర్జాతీయంగా 1 శాతం మేర పెరుగుదలను నమోదు చేశాయి.
ప్రధానంగా అమెరికా ఎకానమీ బలం పుంజుకోవటం, ఎర్ర సముద్రంలో పెరుగుతున్న దాడుల వల్ల ఉద్రిక్తతలు, రష్యాలోని ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి వంటి అనేక కారణాలు దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడ్ చమురు రేటు 83 డాలర్ల నుంచి 84.38 డాలర్లకు పెరిగింది.
ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఎర్ర సముద్ర మార్గంలో హౌతీలు చేస్తున్న క్షిపణి దాడి మెర్స్క్ నౌకలను వెనక్కి వెళ్లేలా చేస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. ఇది ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కారణాలతో రానున్న కాలంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. వీటికి తోడు చమురు ఉత్పత్తి సమైక్య ఒపెక్ తన చమురు మార్కెట్ వాటాను గత కొన్ని రోజులుగా కోల్పోతోంది. అంతర్జాతీయంగా చమురు ధరలను పెంచే క్రమంలో కొన్ని నెలలుగా ఉత్పత్తిని తగ్గిస్తూ ముదుకు సాగటం దీనికి కారణంగా నిలుస్తోంది.
అలాగే నాలుగో త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పుంజుకోవటం, చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలోకి రావటం వల్ల వినియోగం పెరగటం కూడా ధరల పెరుగుదలను ప్రేరేపిస్తోంది. ఈ పరిస్థితులు భారతదేశంలో వాహనదారులపై కూడా త్వరలోనే ప్రభావం చూపొచ్చని తెలుస్తోంది. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మోదీ సర్కార్ పెంపులను తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశం కూడా కనిపిస్తోంది.