దేశ రాజధాని ఓవైపు గణతంత్ర దినోత్సవ వేడుకలకు, మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సిద్ధపడుతున్న వేళ బాంబు కలకలం సృష్టించింది. తూర్పు ఢిల్లీలో రద్దీగా ఉండే ఘాజీపూర్ పూల మార్కెట్లో ఏకంగా 3 కేజీల బరువున్న హై-ఇంటెన్సిటీ బాంబును పోలీసులు గుర్తించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) బృందాలు బాంబును నిర్జన ప్రదేశంలో పేల్చి నిర్వీర్యం చేశాయి.
ఇది కచ్చితంగా ఉగ్రవాదుల కుట్రేనని ఢిల్లీ పోలీసు యంత్రాంగం అనుమానిస్తోంది. గణతంత్ర దినోత్సవాల సమయంలో భారీగా ప్రాణనష్టం కల్గించే విద్రోహ చర్యలకు పాల్పడి, అలజడి సృష్టించాలన్నది ఉగ్రవాదుల పన్నాగమని, అందులో భాగంగానే రద్దీగా ఉండే ఈ పూల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.
పంజాబ్‌లో ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై చర్చ జరుగుతున్న సమయంలో దేశ రాజధానిలోనే భారీ తీవ్రత కల్గిన బాంబు గుర్తించడం కలకలానికి కారణమైంది. . ఘాజీపూర్ మార్కెట్లో ఓ పూలవ్యాపారి అప్రమత్తత పెద్ద ముప్పును తప్పించింది. తన పూల దుకాణం సమీపంలో ఓ స్కూటర్, దానిపై బ్యాగ్ కనిపించడంతో అతనికి అనుమానం కల్గింది. వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు.
బాంబు స్క్వాడ్‌తో సహా ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్ బృందాలు, స్కూటీపై ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో 3 కేజీల బరువున్న బాంబును గుర్తించారు. వెంటనే మార్కెట్‌ను ఖాళీ చేయించి, ఆ బాంబును అక్కడికి సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. ఎన్ఎస్జీ బృందాలు 8 అడుగుల గొయ్యి తవ్వి, ఆ బాంబును నియంత్రిత పద్ధతిలో పేల్చి ముప్పును తప్పించారు.
వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు మార్కెట్లోని సీసీటీవీ కెమేరాలను పరిశీలించగా ఉదయం గం. 9.30 ప్రాంతంలో ఓ వ్యక్తి పూలు కొనే నెపంతో స్కూటీపై ఘాజీపూర్ మార్కెట్ చేరుకున్నట్టు గుర్తించారు. అతనే టైమర్ సెట్ చేసిన బాంబు కల్గిన బ్యాగ్‌ను స్కూటీపై వదిలేసినట్టుగా తేల్చారు.
టైమర్‌లో సెట్ చేసిన సమయం కంటే ముందే పూలవ్యాపారి గుర్తించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెనుముప్పు తప్పింది. ఇదే బాంబు ఎవరూ గుర్తించకపోయినట్టే, దాని పేలుడు తీవ్రతకు భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
పూలను మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయించే రైతులు, పూలవ్యాపారులు, కొనుగోలుదార్లతో ఘాజీపూర్ మార్కెట్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఏ సమయంలో ఎక్కువ రద్దీ ఉంటుందో రెక్కీ చేసి తెలుసుకున్న ఉగ్రవాదులు, ఆ మేరకు బాంబు పేలుడుకు ప్రయత్నించారని పోలీసులు భావిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం బాంబు తయారీలో అమ్మోనియం నైట్రేట్, ఆర్డీఎక్స్ వంటి మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు ఉపయోగించినట్టు తెలిసింది. టైమర్ కోసం మొబైల్ ఫోన్ లేదా, క్లాక్ ఉపయోగించారని పోలీసు వర్గాలు తెలిపాయి.
సీసీటీవీ ఫుటేజి ఆధారంగా ఉగ్రవాదుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బాంబు పేలుడుకు ఎంచుకున్న ప్రదేశం ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నందున ఎన్నికల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.