“నాకు జగనన్నపై ద్వేషం లేదు, ఆయన పాత జగనన్న కాదు, సీఎం అయినా తరువాత జగనన్న మారిపోయాడు, ఈ జగనన్న ఆ జగన్న కాదు” అంటూ ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఉద్వేగంగా స్పష్టం చేశారు. కడప పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం కడప, అన్నమయ్య జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొంటూ జగనన్న కోసం, వైసీపీ కోసం 3200 కిలోమీటర్లు కేవలం ఒక్క మహిళగా పాదయాత్ర చేశానని గుర్తు చేశారు.
కానీ ఈ వైసీపీ కేడర్ కు కనీసం కృతజ్ఞత లేదని, రోజుకో జోకర్ను వస్తున్నాడని, ఉచ్చం నీచం లేకుండా, సిగ్గు శరం లేకుండా వ్యక్తిగత ఆరోపణలతో ఈ జోకర్లు రెచ్చిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లని ఇంగితం లేకుండా తన వ్యక్తిగత జీవితంపై చెలరేగిపోతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తనకు భయపడనని షర్మిలారెడ్డి స్పష్టం చేశారు.
షర్మిలను సీఎం చేయాలని, జగన్ ను జైలులో పెట్టాలని తన భర్త అనిల్ అప్పటి మంత్రి ప్రణబ్ ముఖర్జీని కోరారని ఓ జోకర్ సోషల్ మీడియాలో చెప్పాడని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. కానీ ప్రణబ్ ముఖర్జీని తన వదిన భారతీరెడ్డి సహా తన భర్త కలిశారని,ప్రణబ్ ను తన భర్త ఏం కోరాడో వదినమ్మ భారతీరెడ్డి సాక్ష్యం చెప్పాలని ఆమె డిమాండు చేశారు.
“ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి, పోలవరం కావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, కడపకు ఉక్కు ప్యాక్టరీ రావాలి, అప్పటివరకూ వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా నేను పుట్టిన గడ్డను వీడదు, మడమ తిప్పను, పోరాటం ఆపను” అంటూ ఆమె వెల్లడించారు.
“నా రక్తం వైఎస్ రాజశేఖరరెడి రక్తం, నా పేరు వైఎస్ షర్మిల రెడ్డి, పులి కడుపున పులే పుడుతుంది, ఎంత గీ పెట్టిన నా పేరు వైఎస్ షర్మిల రెడ్డే , ఏం పీక్కుంటారో పీక్కోండి. ఖబడ్డార్, నాకు భయం లేదు’’ అంటూ అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు.
ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, మన జాతకాలు మారాలి, భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలి. లేక పోతే మరో ఐదేళ్లు తిప్పలు తప్పవని ఆమె హెచ్చరించారు. బీజేపీతో ఆంధ్రుల బానిసత్వం పోవాలని, కాంగ్రెస్ పార్టీ రావాలని షర్మిల పిలుపిచ్చారు. అప్పుడే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్యాక్టరీ, రైతులకు రుణమాఫీ వస్తాయని షర్మిలా రెడ్డి వివరించారు. ఇక కాంగ్రెస్ లో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా కాదు, సైన్యంలా పని చేయాలని ఆమె కోరారు.