జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ నేపథ్యంలో రాంచీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 7 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే అరెస్ట్‌కు ముందే జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ స్వయంగా రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.
మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆరుగంటలకు పైగా ప్రశ్నించిన అనంతరం తమ అదుపులోకి తీసుకోవడంతో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుత రవాణా మంత్రి, ఆయనకు సన్నిహితుడైన చంపై సోరెన్ ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
మంగళవారమే హేమంత్ సోరెన్ తన పార్టీ జేఎంఎం ఎమ్మెల్యేలతో సమావేశమైన సందర్భంగా తన వారసుడి గురించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి రాజ్‌భవన్‌కు మినీ బస్సుల్లో వెళ్లారు. వారితోపాటు హేమంత్ సోరెన్ కూడా వెళ్లడం గమనార్హం. ఈ క్రమంలోనే కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను కలిశారు జేఎంఎం ఎమ్మెల్యేలు.
మొదట హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిగా చేస్తారని అంతా అనుకున్నప్పటికీ.. ఆమె ఎమ్మెల్యే కాకపోవడం, రాజకీయ అనుభవం లేకపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేఎంఎం ఎమ్మెల్యేలంతా సీనియర్ సభ్యుడైన చంపాయి సోరెన్ తదుపరి ముఖ్యమంత్రిగా ఉండాలని నిర్ణయించారు. ఇందుకు హేమంత్ సోరెన్ ఆమోదం లభించడంతో చంపాయి సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి కానున్నారు.
మరోవంక, సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా.. ఆ తర్వాత అరెస్ట్‌తో జేఎమ్ఎమ్ అధినేత శిబు సోరెన్ కుటుంబంలో ముఖ్యమంత్రి పదవి కోసం ఇంటి పోరు మొదలైనట్లు కనిపిస్తోంది. తాను అరెస్ట్ అయితే తన భార్య కల్పనా సోరెన్‌ను సీఎం చేయాలని ఆశించిన హేమంత్ సోరెన్‌కు ఆయన వదిన రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రి చేయడానికి తాను వ్యతిరేకం అని శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ బహిరంగంగా ప్రకటించడం సంచలనంగా మారింది.
జార్ఖండ్‌లో రూ.600 కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తున్నది. ఓ ప్రభుత్వ భూమి యాజమాన్యాన్ని మార్చి, ల్యాండ్ మాఫియాకు అమ్మేందుకు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మంది అరెస్టు అయ్యారు.
ఇలా ఉండగా, ఢిల్లీలోని తన నివాసంలో సోమవారం ఈడీ సోదాలు చేయడంపై హేమంత్ సొరేన్ పోలీసులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. దర్యాప్తు సంస్థ అధికారులపై ఆయన రాంచీలోని పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. సొరేన్ ఫిర్యాదు మేరకు కొంత మంది ఈడీ సీనియర్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని రాంచీ సీనియర్ ఎస్పీ చందన్ కుమార్ సిన్హా తెలిపారు.
తనను వేధించడంతో పాటు తనను, తన కమ్యూనిటీ మొత్తాన్ని అవమానించేందుకు, అపఖ్యాతి పాల్జేసేందుకు ఈడీ ఈ సోదాలు చేపట్టిందని సొరేన్ ఆరోపించారు. అధికారుల చర్యల వలన తాను, తన కుటుంబసభ్యులు మానసిక క్షోభను అనుభవించామని సొరేన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో సోదాల సందర్భంగా ఈడీ అధికారులు సీజ్ చేసిన కారు, స్వాధీనం చేసుకొన్న నగదు తనది కాదని అందులో చెప్పారు.