త్వరలోనే 500లకే గ్యాస్ సిలిండర్, ఉచితంగా రూ. 200 యూనిట్ల కరెంట్ ను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన తొలుత కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమంలో మాట్లాడుతూ మరో రెండు హామీలపై ప్రకటన చేశారు.
“త్వరలోనే రూ. 500 గ్యాస్ సిలిండర్ అందజేస్తాం. ప్రియాంక గాంధీని పిలిచి లక్ష మందితో సభ నిర్వహించుకుందాం. త్వరలోనే ప్రకటన వస్తుంది. ఇదే కాకుండా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ను అందజేస్తాం. మీ కష్టాలను తీర్చేందుకే మన ప్రభుత్వం పని చేస్తుంది. ఈ రెండింటిని అమలు చేయాలని నిర్ణయించాం. త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
నాగోబా దర్బార్ హాల్ లో స్వయం సహాయక సంఘాలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.60కోట్ల విలువైన బాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. స్వయం సహాహక సంఘాలకు పూర్వ వైభవం తీసుకోస్తామని హామీనిచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మ గౌరవంతో బ్రతకాలనేదే తమ ఆకాంక్ష అని చెప్పారు.
స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని స్వయం సహాయక సంఘాలకే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారని అలాంటి వారు ఊర్లలోకి వస్తే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొంటూ మాట ఇచ్చిన ప్రకారం ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ విధ్వంసానికి గురైందని పేర్కొంటూ నాగోబా ఆలయాన్ని గత ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.
తాము అధికారంలోకి వచ్చి 60 రోజులు కూడా పూర్తి కాలేదని, అప్పుడే 6 గ్యారంటీలు పూర్తి కాలేదని కొందరు అడుగుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం కనీసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన చేసిందా? అని ప్రశ్నించారు.