గురువారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్(సర్వైకల్ క్యాన్సర్) ప్రస్థావన రావడంతో ఇప్పుడు అందరూ దీనిపై దృష్టి సారిస్తున్నారు. 9 నుంచి 14 ఏళ్ల బాలికలు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
మహిళల్లో క్యాన్సర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది రొమ్ము క్యాన్సరే. ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్). నిజానికి, గర్భాశయ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్. ఇక భారత్‌లో అత్యధికంగా వెలుగు చూస్తోన్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది.
లక్షల సంఖ్యలో సర్వైకల్ క్యాన్సర్ బాధితులు మన దేశంలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 3,42,333 మంది ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ భగేల్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
ఎక్కువ మంది బాధితులున్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ 7, తెలంగాణ 11వ స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 45,682 మంది సర్వైకల్ క్యాన్సర్ బాధితులు ఉన్నారు.
ఆ తర్వాతి స్థానంలో తమిళనాడులో 36,014, పశ్చిమ బెంగాల్లో 25,822, బీహార్‌లో 23,164, కర్ణాటకలో 20,678 మంది, మధ్యప్రదేశ్‌లో 18,475 మంది బాధితులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ఏపీలో 17,146 మంది, తెలంగాణలో 11,525 మంది బాధితులు ఉన్నట్లు వివరించింది.
ఇదిలా ఉండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌లో 2022లో కొత్తగా 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యాయి. ఆ ఏడాది సుమారు 9.1 లక్షల మంది ఆ వ్యాధి వల్ల మరణించారు. ఎక్కువ శాతం భారతీయుల్లో రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
పెదవు, నోరు, ఊపిరితిత్తులు క్యాన్సర్ కేసులు ఎక్కువ శాతం పురుషుల్లో ఉన్నాయి. నోటి క్యానర్స్ 15.6 శాతం, శ్వాసకోస క్యాన్సర్ 8.5 శాతం కేసులు ఉన్నాయి. ఇక మహిళల్లో రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ 27 శాతం, 18 శాతం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ అంచనా వేసింది.
ఈ సంస్థ డబ్ల్యూహెచ్ క్యాన్సర్ ఏజెన్సీగా పనిచేస్తోంది. క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించిన అయిదేళ్ల తర్వాత కూడా ఇండియాలో ప్రాణాలతో ఉన్న వారి సంఖ్య 32.6 శాతంగా ఉన్నట్లు ఆ రిపోర్టులో తేల్చారు. అయిదుగురిలో ఒకరి క్యాన్సర్ వస్తుందని, 9 మంది పురుషుల్లో ఒకరు, 12 మంది మహిళల్లో ఒకరు క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.