ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష ఇండియా కూటమిలో విభేదాలు రోజురోజుకు పెరుగుతోంది! బీజేపీతో చేరి ఇప్పటికే ఇండియా కూటమికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు.. కాంగ్రెస్‌పై బంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన విమర్శలు కూటమిలో మరోసారి కలకలం రేపుతున్నాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు రావడం కూడా అనుమానమే అని ఆమె చెప్పడం పెను దుమారం రేపింది. బెంగాల్లో సీట్ షేరింగ్ అంశంపై ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే మమత ఈ విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే బెంగాల్‌లోని ఆరు జిల్లాలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపై కూడా మమతా బెనర్జీ విమర్శల వర్షం కురిపించారు. అది కేవలం ఫొటో షూట్ అని, రాష్ట్రంలోని మైనారిటీ ఓట్లను చీల్చేందుకు వలస పక్షి వచ్చిందని అంటూ ఆమె మండిపడ్డారు.
“బీజేపీ నుంచి బలమైన పోటీ ఎదురయ్యే 300 సీట్లల్లో పోటీ చేయాలని నేను కాంగ్రెస్‌కి సూచించాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చి ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. అసలు 300 సీట్లల్లో పోటీ చేసినా, కాంగ్రెస్‌కు కనీసం 40 సీట్లైనా వస్తాయా? అన్నది నాకు అనుమానంగా ఉంది,” అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు.
“2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ్ బెంగాల్లో కూటమిగా ఏర్పడేందుకు నేను సిద్ధమని కాంగ్రెస్‌కి చెప్పాను. కానీ వాళ్లు వినలేదు. రెండు సీట్లు ఇస్తామని అన్నాను. ఒప్పుకోలేదు. వాళ్లని 42 సీట్లల్లో పోటీ చేసుకోనివ్వండి. ప్రస్తుతానికైతే రెండు పార్టీల మధ్య సీట్ల సద్దుబాటు విషయంలో మాటలు జరగడం లేదు. బంగాల్లో బీజేపీని ఓడించేందుకు మేము ఒంటరిగా పోటీ చేస్తాము,” అని ఆమె తేల్చి చెప్పారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ్ బంగాల్లోని ఉత్తర దినాజ్‌పూర్, మాల్ది, మర్షిదాబాద్ వంటి మైనారిటీ ప్రాంతాల్లో జరిగింది. ఈ ప్రాంతాలపై కాంగ్రెస్‌కు అనాదిగా పట్టు ఉంది. కానీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటనలపై మమతా బెనర్జీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్టు సమాచారం.
“ఇండియా కూటమిలో మేము కూడా ఉన్నాము. కానీ రాష్ట్రంలో యాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్ మాకు చెప్పలేదు. అధికారులు చెబితేనే తెలిసింది. డారెక్ ఒబ్రెయిన్ (టీఎంసీ ఎంపీ)కి ఫోన్ చేసి, ర్యాలీకి అనుమతివ్వాలని కోరారు. మరి పశ్చిమ్ బెంగాల్‌కు రావడం ఎందుకు?” అంటూ ఆమె తన అసంతృప్తిని వెల్లడించారు.