గత ఏడాది ఉద్భవించిన కరోనా డెల్టావేరియంట్ భారత్లో భారీగా ప్రాణాలను బలిగొందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో 2,40,000 మంది ప్రాణాలను బలిగొందని తెలిపింది.
పైగా, ఆర్థిక పునరుద్ధరణకు అంతరాయం కలిగించిందని పేర్కొన్నది. సమీప భవిష్యత్ లో సహితం భారత్ లో ఈ విధంగా భారీ మరణాలు జరగవచ్చని హెచ్చరించింది.
‘ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్టర్ 2022’ పేరుతో గల ఈ నివేదిక ఒమిక్రాన్ సహితం అత్యంత తీవ్రంగా వ్యాపిస్తోందని, ప్రపంచ వ్యాప్త టీకా కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టనంత వరకూ… మహమ్మారి సవాళ్లు విసురుతూనే ఉంటుందని పేర్కొంది.
దీంతో ప్రపంచం ఆర్థికంగా కోలుకోవడానికి ఇబ్బందులు తప్పవని, దక్షిణాసియా ప్రాంతంలో టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతోందని తెలిపింది. ఫలితంగా అక్కడ కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు ఉందని పేర్కొంది.
బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్లలో డిసెంబరు నాటికి కేవలం 26 శాతం మంది జనాభా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు అందించిందని, భూటాన్, మాల్డీవులు, శ్రీలంక వంటి దేశాలు 64 శాతం వ్యాక్సిన్లు అందించాయని నివేదికలో తెలిపింది.
భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 1,54,61,39,465 టీకాలు వేశారు. కరోనా మహమ్మారి రెండో వెవ్ భారతదేశం అంతటా వినాశనం కలిగించింది, ఎందుకంటే మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది అంటువ్యాధుల పెరుగుదల దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలపై భారం పడుతోంది.
మరొకవంక, దేశంలో భారీగా కరోనా రోజువారి కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,68,833 కొవిడ్ కేసులు నమోదు అవగా.. 1,22,684 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 14,17,820గా ఉంది. రోజువారీ కొవిడ్ పాజిటివ్ రేటు 16.66 శాతంగా నమోదు అయ్యింది. మరోవైపు దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 6,041కి చేరింది.