తెలంగాణలో మరో రెండు పథకాలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సుదీర్ఘంగా సాగిన కేబినెట్ సమావేశంలో రూ.500కే గ్యాస్ సిలిండర్‌తో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కంరెట్ పథకాల అమలుపై మంత్ర వర్గం చర్చించి ఈ రెండు పథకాల అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక వీటితో పాటు మరిన్ని అంశాలపై కూడా చర్చించిన కేబినెట్ .. సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు వెల్లడించారు.
టీఎస్ ను టీజీగా మార్చటానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు. ఇక నుంచి వాహనాల నెంబర్ ప్లేట్లపై టీజీగా రిజిస్ట్రేషన్ జరగనున్నట్టు మంత్రులు తెలిపారు. మరోవైపు అందెశ్రీ రాసిన జయ జయహే పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసినట్టు వివరించారు. రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రులు చెప్పుకొచ్చారు.
తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ మార్పులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ తల్లి అంటే ఎవరినో ఊహించుకునే తల్లి కాకుండా తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న రూపాన్ని తీసుకొస్తామని మంత్రులు వివరించారు. అయితే వీటి మార్పుల విషయంల రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుని, ప్రజల అభీష్ఠం మేరకు మార్పులు చేయనున్నట్టు మంత్రులు పేర్కొన్నారు.
మరోవైపు ఎన్నికలప్పుడు చెప్పిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల గణన కూడా చేపట్టే విషయంపై చర్చించిన కేబినెట్ దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయింపుపై కూడా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
మరోవైపు.. రాష్ట్రంలోని.. 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్డేట్ చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. వీటితో పాటు.. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలన్న విషయంపై కూడా చర్చించిన మంత్రివర్గం.. కీలక నిర్ణయం తీసుకుందని మంత్రులు తెలిపారు.