టీడీపీ, జనసేన పొత్తు విషయంలో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీలు అగ్ర నాయకులు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం రెండు దఫాలుగా సుదీర్ఘంగా ఏకాంతంగా సమావేశమై జనసేన పోటీచేసే నియోజకవర్గాల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు.
జనసేనకు అంతిమంగా 25 అసెంబ్లీ సీట్లు, రెండు లోక్ సభ సీట్లు ఖాయం కానున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు సిద్దమయ్యారు. ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అందులో చంద్రబాబు, పవన్ ఇద్దరూ పాల్గొని ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేస్తారు.
ఇక, బీజేపీ పొత్తు పైన స్పష్టత తీసుకోవాలని నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాల తరువాత పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ నేతల వైఖరి పైన స్పష్టత తీసుకొని కలిసి వస్తే సీట్ల కేటాయింపు, మేనిఫెస్టో పైన చర్చ చేయనున్నారు. లేకుంటే..తమ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
జనసేనాని 32 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలు ఇవ్వాలని కోరారు. ఇందులో 20 స్థానాలిచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని, వాటిపై ఏకాభిప్రాయం కూడా కుదిరిందని జనసేన వర్గాలు తెలిపాయి. టీడీపీ మరో ఐదు స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని, 27 ఇవ్వాలని పవన్ కోరుతున్నారని చెబుతున్నారు. అదేవిధంగా, కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకు ఇచ్చారు. తాజాగా అనకాపల్లి గానీ, తిరుపతి గానీ ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసింది. సామాజిక సమీకరణలు, వైసీపీ అభ్యర్థులు, సర్వేల్లో వస్తున్న ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ తమ పార్టీకి విజయనగరంలో 1, విశాఖ-6, తూర్పుగోదావరి-6, పశ్చిమ గోదావరి-4, కృష్ణా-3, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో రెండు స్థానాల చొప్పున కోరారు. కడప, కర్నూలు జిల్లాలో పవన్ ఒక్కో సీటు ప్రతిపాదించారు.
వీటిలో రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ (పశ్చిమ), తెనాలి, దర్శి సహా 20 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. కాకినాడ రూరల్ సీటు జనసేనకు ఇచ్చి, కాకినాడ అర్బన్ సీటులో తాను పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది.
రాయలసీమ జిల్లాల్లో జనసేన ఆశిస్తున్న వాటిలో తిరుపతి, మదనపల్లె, రాజంపేట, అనంతపురం వంటివి ఉన్నాయి. జనసేనకు గట్టి అభ్యర్థి ఉంటే తిరుపతి సీటు ఆ పార్టీకి ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. సీట్లు..అభ్యర్దుల పైన ఈ నెల 8న మరోసారి సమావేశమై అభ్యర్దులను ఖరారు చేయనున్నారు.