తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే కూలిపోతుందని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల దాకా ఆ పార్టీకి అధికారం దక్కలేదని విమర్శించారు. ఇప్పుడు కూడా అబద్దపు హామీలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారం అప్పగించారని ఆరోపించారు.
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తొందరలోనే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదాపై మాట్లాడటాన్ని విజయసాయి రెడ్డి తప్పుబట్టారు. ఏపీపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా చేర్చేవారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ నేతల్లో ఏకాభిప్రాయం లేదని స్పష్టం చేశారు.
పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారని ఈ విషయాన్ని చరిత్ర మరువదని హెచ్చరించారు. కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్ కు అలవాటు అంటూ పరోక్షంగా షర్మిల వ్యవహారం ప్రస్తావిస్తూ మండిపడ్డారు.