ఎవరేమన్నా వచ్చే ఎన్నికల్లో మూడో సారి విజయం సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమాను వ్యక్తం చేశారు. . రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు సోమవారం ప్రధాని సమాధానమిస్తూ `అబ్ కీ బార్ మోదీకి సర్కార్’ అని ఆయన భరోసా వ్యక్తం చేశారు. మూడో టర్మ్ లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నామని వెల్లడించారు.
వంద రోజుల్లో మరోసారి తమ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెబుతూ ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని, బీజేపీకి స్వంతంగా 370కి పైగా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. భగవాన్ రాముడు తన స్వంత ఇంటికి వచ్చాడని చెబుతూ తాము మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించనుందని స్పష్టం చేశారు.
2014లో ప్రపంచంలో 11వ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న ఇండియా ప్రస్తుతం ఐదవ స్థానానికి చేరుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 11వ, స్థానంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను చూసి గొప్పలు చెప్పుకున్నారని కాంగ్రెస్ పై మోదీ విమర్శలు చేశారు. కానీ తమ ప్రభుత్వం ఇండియాను ఐదో స్థానానికి తీసుకు వచ్చిందని తెలిపారు.
విపక్షాలు చాలా కాలంగా అక్కడే ఉండాలని తీర్మానించుకున్నాయని చెబుతూ దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందున దశాబ్దాల తరబడి విపక్షంలో ఉండాలని విపక్షాలు భావిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. విపక్షాల కోరికను భగవంతుడు నెరవేరుస్తారని భావిస్తున్నట్టుగా మోదీ చెప్పారు. ఎన్నికల తర్వాత విపక్షాలు ప్రేక్షకుల సీట్లకే పరిమితమౌతాయని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ వైఖరి వల్లే ప్రజాస్వామ్యానికి, దేశానికి నష్టమని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటేనే వారసత్వ రాజకీయాలని పేర్కొంటూ పదేళ్లు విపక్షంలో ఉన్నా కూడ కాంగ్రెస్ తీరులో మార్పు రాలేదని ఆయన విమర్శించారు. మహిళలు, యువత, పేదలు రైతులపై దేశాభివృద్దిపై ఆదారపడి ఉందని ప్రధాని చెప్పారు.
దేశంలో అవినీతిపరులపై దర్యాప్తులు సంస్థలు దాడులు చేస్తుంటే విపక్ష నేతలు వారికి మద్దతు పలుకుతూ ప్రభుత్వం విమర్శుల చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఈడీ రూ. 5 వేల కోట్లు సీజ్ చేసింది. అయితే, తమ ప్రభుత్వ హయాంలో ఈడీ రూ. 1 లక్షల కోట్లు అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. అవినీతిపరులపై యుద్ధం కొనసాగుతుందని చెబుతూ దేశాన్ని దోచుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. దోచుకున్న ప్రతీపైసాను కక్కిస్తామని ప్రధాని తేల్చి చెప్పారు.
మైనార్టీల పేరిట ఎంతకాలం రాజకీయాలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. మైనార్టీలు అంటే ఎవరంటూ మహిళలు మైనారిటీలు కారా? రైతులు మైనారిటీలు కారా? అని ఆయన అడిగారు. ఎంతకాలం విభజన రాజకీయాలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలకు స్వంత పార్టీలు లేవని పేర్కొంటూ వారసత్వ పాలనకు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్ బాధితులయ్యారని చెప్పారు. తాము మేకిన్ ఇండియా అంటుంటే కాంగ్రెస్ క్యాన్సిల్ అంటుందని అంటూ మండిపడ్డారు.
దేశ ప్రజలందరితో కలిసి దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడుపుతున్నామని చెప్పారు ప్రధాని మోదీ. విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని కోరుతూ వికసిత్ భారత్ కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.