ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో గోరఖ్పూర్ (అర్బన్) స్థానం నుంచి పోటీ చేయనున్నారు. యూపీ ఎన్నికలకు సంబంధించి 57 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ శనివారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఆ జాబితాలో ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ నుంచి పోటీకి దిగుతారని ప్రకటించింది.
అదేవిధంగా యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్రాజ్ జిల్లాలోని సిరతు స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గోరఖ్పూర్ (అర్బన్) ముఖ్యమంత్రికి కంచుకోటగా ఉంది. యోగి అక్కడినుంచి 2017 వరకు వరుసగా ఐదు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు గోరఖ్పూర్ నుంచి పోటీ చేస్తే ఆరవసారి కానుంది.
సీఎం యోగి గోరఖ్పూర్ నుంచి పోటీ చేయడమనేది చాలా చర్చల తర్వాత పార్టీ అగ్ర నాయకత్వం తీసుకున్న తుది నిర్ణయమని కేంద్ర మంత్రి, రాష్ట్ర ఎన్నికల పార్టీ ఇన్ ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పార్టీ నిర్ణయం ప్రకారం.. ఏ సీటు నుంచి పోటీ చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు యోగి ఆదిత్యనాథ్ సంసిద్ధతను వ్యక్తం చేశారని జాబితాను విడుదల చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ చేప్పారు.
గతంలో ఎన్నడూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని ముఖ్యమంత్రి యోగి అయోధ్య లేదా మధురలలో ఏదో ఒకదాని నుంచి పోటీ చేస్తారని గతంలో ఊహాగానాలు వచ్చాయి. చివరికి గోరఖ్పూర్ కన్ఫమ్ అయింది. యూపీలో ఫిబ్రవరి 10న ప్రారంభమయ్యే ఏడు దశల ఎన్నికల కౌంటింగ్ మార్చి 10న జరగనుంది.
ఫిబ్రవరి 10, 14 తేదీల్లో మొదటి, రెండో విడత పోలింగ్ జరిగే స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మొదటి దశలో ఎన్నికలు జరిగే 58 స్థానాలకు 57 మంది అభ్యర్థులను, రెండో దశలో 55 స్థానాలకు గాను 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. 63 మంది ప్రస్తుత శాసనసభ్యులకు తిరిగి సీట్లు ఇచ్చారు.
తనకు గోరఖ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, బీజేపీ సెంట్రల్ పార్లమెంటరీ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే మంత్రం ఆధారంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. పూర్తి మెజార్టీతో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని యోగి విశ్వాసం వ్యక్తం చేశారు