వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించింది. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కడపకు చెందిన మేడా రఘునాధరెడ్డి, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డిలను ఎంపిక చేసింది. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. గతంలో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల పేర్లను పరిశీలించారు.. దాదాపు ఫైనల్ చేసినట్లు వార్తలొచ్చాయి.
కానీ అన్యూహంగా ఆరణి శ్రీనివాసులు స్థానంలో కడపుకు చెందిన మేడా రఘునాథరెడ్డిని ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. గురువారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్ జరుగనుంది.
ఈ ఏడాది ఏప్రిల్లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రబాబు, సీఎం రమేష్ పదవీ కాలం ముగియనుంది. వీరు ముగ్గురు ఏప్రిల్ 2వ పదవీవిరమణ చేస్తారు. వీరి స్థానాల భర్తీకే ఎన్నికలు జరుగుతాయి.