తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ఉండనుందని, మెజార్టీ సీట్లు గెలుస్తామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని, బిజెపి విజయం సాధించదని కుమ్మక్కు అవుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేసిన బిఆర్ఎస్కు ఓటేసిన ఒక్కటేనని స్పష్టం చేస్తూ బిఆర్ఎస్ నాయకులంతా బిజెపిలో చేరాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌కు బిజెపికి ప్రధాన పార్టీ అని, బిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండదని తేల్చి చెప్పారు. బిఆర్ఎస్ అరకొర సీట్లు గెలిచినా, ఓడినా తెలంగాణకు ఒరిగేది, పోయేది ఏం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఎంఐఎం సీటుతో పాటు తెలంగాణలో అన్ని సీట్లు గెలుస్తామని, ఈసారి అసదుద్దీన్‌ను ఓడిస్తామని సవాల్ విసిరారు. సర్వేలు వాస్తవాలు కావని, తెలంగాణలో మెజార్టీ సీట్లు బిజెపి గెలిచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు డూప్ ఫైటింగ్ చేస్తున్నారని, వంద రోజుల్లో హామీలు ఆమలు, అవినీతి పరులుపై చర్యలు అన్నారని ఆయన గుర్తు చేశారు. కానీ చర్యలు తీసుకోవడం ప్రభుత్వం మీనమేశాలు లెక్క పెడుతున్నారని, ఇంకా సెటిల్ మెంట్లు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కాళేశ్వరంపై చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని చెబుతూ తెలంగాణ సెంటిమెంట్‌తో రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు.
జల వివాదాల పై ప్రజలను కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు మభ్య పెడుతున్నారని చెబుతూ నాగార్జున సాగర్ విషయంలో రెండు ప్రభుత్వాలు కలిసి చర్చించి, నిర్ణయం తీసుకోవాలని కిషన్ రెడ్డి హితవు చెప్పారు. దేశానికి మూడోసారి ప్రధానిగా మోదీ కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటాన్నారని స్పష్టం చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే కేంద్ర కాంగ్రెస్ కోసం వసూళ్లు మొదలు పెట్టిందని, కేంద్ర కాంగ్రెస్‌కు సూటు కేసులు మోస్తున్నారన్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. కర్ణాటకలో దోపిడీ చేసి తెలంగాణలో ఖర్చు పెడితే తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీ చేస్తోందని దుయ్యబట్టారు. డబ్బుల కోసం మంత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బెదిరిస్తున్నారని చెబుతూ పార్లమెంట్ ఎన్నికల్లో లో బిజెపి స్వతంత్రంగా పోటీ చేస్తుందని వెల్లడించారు.