ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం తోటి ఎంపీలతో కలిసి పార్లమెంట్ క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్రం విడుదల చేసిన శ్వేతపత్రంపై పార్లమెంట్లో శుక్రవారం చర్చ జరిగింది.
అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో ఓ అనూహ్య దృశ్యం ఆశ్చర్యానికి గురి చేసింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ క్యాంటీన్లో భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యపర్చారు. బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలను ప్రధాని విందుకు ఆహ్వానించారు.
దీనిగురించి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఎంపీలకు ప్రధాని నుంచి ఫోన్ వచ్చింది. ‘పదండి.. ఈ రోజు మీకో పనిష్మెంట్ ఇస్తాను’ అని మోదీ వారితో నవ్వుతూ సరదాగా అన్నట్లు సమాచారం. అనంతరం ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ పార్లమెంట్ క్యాంటీన్‌కు వెళ్లారు.
బీజేపీ ఎంపీలు హీనాగవిత్, ఎల్.మురుగన్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే తదితరులు ప్రధానితో కలిసి భోజనం చేశారు దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ విందులో ప్రధాని మోదీ ఎంపీలతో పలు విషయాలపై ముచ్చటించినట్లు సమాచారం. విదేశీ పర్యటనల విశేషాలు, వ్యక్తిగత విషయాలను మోదీ పంచుకున్నట్లు సమాచారం. తనతో పాటు ఆ ఎంపీల భోజనానికి అయిన ఖర్చును ప్రధానే చెల్లించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.