కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ కొనసాగుతూ ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలు, రోడ్ షో లు, సభలపై జనవరి 22 వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది.
శనివారం ఐదు రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని కీలక సమావేశంలో సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
భౌతిక ర్యాలీలు, రోడ్షోలపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఇక 300 మందితో ఇండోర్(క్లోజ్డ్) సభలకు అనుమతి ఇస్తూ.. హాల్ సామర్ధ్యంలో 50శాతం మందితో సభ నిర్వహించుకోవచ్చని పార్టీలకు అనుమతి ఇచ్చింది ఈసీ. రాజకీయ పార్టీలన్నీ కరోనా ప్రోటోకాల్, ఎన్నికల కోడ్ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
ఎన్నికలు జరగాల్సిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాలో కరోనా కల్లోలం కలకలం రేపుతోంది. భారీ ఎత్తున నమోదవుతున్న కేసులు ఆయా రాష్ట్రాల్లో. దీంతో ఎన్నికల సంఘం తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే క్రమంలో ఆయా చోట్ల ఎన్నికల బహిరంగ సభలు, ర్యాలీలపై జనవరి 15 వరకూ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
తర్వాత పరిస్దితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో ఇవాళ నిషేధంపై సమీక్ష నిర్వహించి.. పొడగింపు నిర్ణయం వెల్లడించింది. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి.
పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్లో మాత్రం ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10, మార్చి 7 మధ్య ఉత్తరప్రదేశ్ ఏడు దశల్లో 403 ఎమ్మెల్యేలను ఎన్నుకోనుంది. ఓట్ల లెక్కింపు మొత్తంగా మార్చి 10న జరగనుంది.