తెలంగాణ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లుగా వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.33,786 కోట్లు ఉండగా, రెవెన్యూఖాతాలో మిగులు రూ.9,031 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు.
మూలధన వ్యయం రూ.24,178 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను సవరించిన అంచనాలు రూ.2,24, 625 కోట్లుగా తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించినట్లు చెబుతూ ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయడం జరిగిందని చెప్పారు. హామీలకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున, అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం అని స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. అందుకు విధివిధానాలను రూపొందిస్తున్నామని. ప్రతి పంటకు మద్దతు ధర కూడా అందిస్తామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. రైతుబంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు.
అదే విధంగా ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల భీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామని తెలిపారు. రైతుబీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాసిరకం విత్తనాలను, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెబుతూ ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.
- 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891కోట్లు
- పరిశ్రమల శాఖ రూ.2543 కోట్లు
- ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
- ఐటీ శాఖకు రూ.774 కోట్లు
- పంచాయతీ రాజ్ రూ. 40,080 కోట్లు
- పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
- మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు
- వ్యవసాయానికి రూ.19.746 కోట్లు
- ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250కోట్లు
- ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు
- ఎస్సి సంక్షేమం రూ. 21874 కోట్లు
- ఎస్టీ సంక్షేమం రూ. 13013 కోట్లు
- మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు
- బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ. 1546 కోట్లు
- బీసీ సంక్షేమం రూ. 8 వేల కోట్లు
- విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
- వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
- తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ. 500 కోట్లు
- యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ. 500 కోట్లు
- గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు
- విద్యుత్ గృహ జ్యోతికి రూ. 2418 కోట్లు
- విద్యుత్ సంస్థలకు రూ. 16825 కోట్లు
- నీటి పారుదల శాఖ కు రూ. 28024 కోట్లు