అయోధ్యలోని రామమందిరాన్ని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 325 మందికిపైగా ఎమ్మెల్యేలు ఆదివారం దర్శించుకుని, పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక విమానంలో ఆయన క్యాబినెట్ మంత్రులతో పాటు అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 10 బస్సుల్లో అయోధ్యకు చేరుకున్నారు. ఆలయానికి వెళ్లి బాలక్ రామ్‌ను దర్శించుకున్నారు.
మందిరం అంతా ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగింది. ఆలయంలో పూజలు నిర్వహించామంటూ మందిరం మెట్ల వద్ద దిగిన ఫోటోలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్లో షేర్ చేశారు. కొందరు ఎమ్యెల్యేల కుటుంభం సభ్యులతో కలిపి 400 మందికి పైగా దర్శించుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం సమాజావాది పార్టీ ఎమ్యెల్యేలు మినహా అన్ని పార్టీల ఎమ్యెల్యేలు రావడం గమనార్హం.
యూపీ స్పీకర్ సతీశ్ మహానా సైతం ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను ఎందుకంటే నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఇక్కడ ఒక నిర్మాణం నిలబడి ఉంది.. అది డిసెంబర్ 6 న మా ముందు విరిగిపోయింది. 1990లో తూటాలు పేలినప్పుడు నేను ఇక్కడకు వెళ్లాను.. వేదిక నిర్మాణం సమయంలోనూ వచ్చాను.. ఈరోజు, దైవ సన్నిధిని ప్రత్యక్షంగా చూసే భాగ్యం నాకు లభించింది’ అని పోస్ట్ పెట్టారు.
ఇదిలా ఉండగా, అయోధ్య ఆలయ సందర్శనకు స్పీకర్ పంపిన ఆహ్వాన్ని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ తిరస్కరించింది. ‘జనవరి 22న జరిగిన రామమందిర ప్రాణప్రతిష్ఠకు మమ్మల్ని ఆహ్వానించలేదు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదు. అప్పుడు స్పీకర్ కూడా మమ్మల్ని రమ్మని చెప్పలేదు. ఎస్పీ ఎమ్మెల్యేలు అయోధ్య వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని మా నాయకుడు అఖిలేశ్ యాదవ్‌ను కోరుతాం’ అని ఎస్పీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్యే శివపాల్ సింగ్ యాదవ్ పేర్కొన్నారు.
మరోవైపు, అయోధ్య రామమందిర దర్శనానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. రోజుకు లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు.