బీహార్ లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్), భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. ఈ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శాసనసభలో తన బలాన్ని సోమవారం నిరూపించుకో గలిగారు.
కిందటి నెలలో జేడీయూ- రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహా ఘట్బంధన్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఎన్డీఏ కూటమిలో చేరి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తనకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ, బీజేపీ, దాని మిత్రపక్షాల శాసన సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు.
243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 122. జేడీయూకు 45 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి ఉన్న 78, దాని మిత్రపక్షం హిందుస్తాన్ ఆవామీ లీగ్-4 స్థానాలను కలుపుకొంటే ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోగలుగుతుంది. జేడీయూ, బీజేపీ, ఆవామీ లీగ్‌కు చెందిన 127 మంది సభ్యులు తీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించారు.
ఆయనకు మద్దతుగా లేఖలు ఇవ్వడంతో దీనితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏను ఆహ్వానించారు గవర్నర్. తొమ్మిదో సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారాయన. సభలో తన బలాన్ని నిరూపించుకోవడానికి గవర్నర్ 10 రోజులు గడువు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించారు.
స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీని వాడివేడిగా చర్చ సాగింది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభలో బలాన్ని నిరూపించుకున్నంత మాత్రాన ప్రజల్లో ఆదరణ పొందినట్లు కాదని విమర్శించారు.
అయిదు సంవత్సరాల కాలపరమితిలో ఒకే వ్యక్తి వేర్వేరు పార్టీల తరఫున మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దేశ చరిత్రలోనే లేదంటూ ఎద్దేవా చేశారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ బిహార్ ప్రజల కోసమే తాను మహాఘట్బంధన్ కూటమి నుంచి బయటికి వచ్చానని, వారి కోరిక మేరకే ఎన్డీఏలో చేరానని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలనూ క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందిస్తానని చెప్పారు.
అనంతరం ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా మొత్తం 129 మంది సభ్యులు నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఇందులో బీజేపీ-78, జేడీయూ- 45, హిందుస్తాన్ ఆవామీ లీగ్-4, ఇతరులు ఒకరు ఉన్నారు. రాష్ట్రీయ జనతాదళ్- 79, కాంగ్రెస్-19, వామపక్షాలు- 16, ఏఐఎంఐఎం ఒక ఒకరు నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.
స్పీకర్ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. నిజానికి ఫ్లోర్ టెస్ట్‌కు ముందు ఎన్డీఏ కూటమి బలం 127 మాత్రమే. బలపరీక్ష ప్రారంభ సమయానికి ఇది 129కి పెరిగింది. ఆర్జేడీ సభ్యులు చేతన్ ఆనంద్, నీలం ఆనంద్, ప్రహ్లాద్ యాదవ్ చివరి నిమిషంలో పార్టీ ఫిరాయించారు. అధికార పక్షం వైపు కూర్చుని, నితీష్‌కు మద్దతు ఇచ్చారు.
తొలుత గవర్నర్ ప్రసంగం అనంతరం ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవథ్ బిహారీ చౌదరిపై అధికార పక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు వ్యతిరేకంగా 112 ఓట్లు పడటంతో స్పీకర్‌ను తొలగించారు.