కనీస మద్దతు ధర (ఎంఎస్పి) చట్టం, తదితర సమస్యల పరిష్కారం కోసం ‘చలో ఢిల్లీ’ చేపట్టిన రైతులపై రైతుల మార్చ్ కొనసాగుతోంది. రైతులు ట్రాక్టర్, ట్రాలీలపై ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. పంజాబ్ -హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులపై భద్రతా సిబ్బంది మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మధ్య గురువారం కేంద్ర ప్రభుత్వం మూడోసారి రైతు సంఘాల నేతలతో చర్చలు జరపనుంది.
వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోం వ్యవహారాల సహాయక మంత్రి నిత్యానంద రాయ్ గురువారం సాయంత్రం 5 గంటలకు రైతు నేతలతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరి 8, 12 తేదీల్లో రైతులతో జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.
కాగా, పంజాబ్‌లో భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్), బికెయు దకౌండా (ధనేర్) గురువారం రైల్ రోకో ప్రకటించాయి. శంబు, ఖనౌరీ సరిహద్దుల్లో హర్యానా భద్రతా సిబ్బంది టియర్‌గ్యాస్ షెల్స్ మరియు వాటర్ కెనాన్లను వినియోగించడాన్ని నిరసిస్తూ ఆ సంఘాలు రైల్‌రోకోకు పిలుపునిచ్చారు.
గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఏడు ప్రాంతాలలో రైలు రోకో చేపట్టనున్నట్లు ప్రకటించాయి. అదే సమయంలో టోల్ ప్లాజాల వద్ద ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరసనలు చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది.
పెద్ద సంఖ్యలో భద్రత బలగాలను, పోలీసులను రంగంలోకి దింపారు. ఢిల్లీలోకి అడుగుపెట్టనీవ్వకుండా అడ్డుకునేందుకు పోలీసులు బుధవారం ఉదయం కూడా లాఠీ ఛార్జీ చేయడంతో పాటు డ్రోన్ల ద్వారా భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. కేంద్రం ఇటీవల భారతరత్న ప్రకటించిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ సైతం రైతులపై పోలీసుల దాడి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు నేరస్తులు కారని, దేశానికి అన్న ప్రదాతలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు.
అన్నదాతల ‘చలో ఢిల్లీ’ నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు అడుగుడుగునా భద్రతా ఏర్పాట్లు చేయడం, సెంట్రల్ ఢిల్లీతో హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద ఆంక్షలు విధించడంతో రాజధాని సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. భారీ భద్రత, కాంక్రీట్ బారికేడ్లు ఉన్నప్పటికీ రైతులు తమ ఢిల్లీ చలో మార్చ్‌ను కొనసాగించడంతో శంభు ప్రాంతం వద్ద వందలాది ట్రాక్టర్లు బారులు తీరాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
డ్రోన్లతో టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారు. అయితే రైతులు గాలిపటాలతో వాటికి చెక్ పెడుతున్నారు. గాలిపటాలు ఎగురవేసి డ్రోన్లను అడ్డుకుంటున్నారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టియర్ గ్యాస్ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు రైతులు తాగేందుకు తీసుకొచ్చుకున్న నీళ్ల బాటిళ్లతో దుస్తులు తడిగా ఉంచుకుంటున్నారు.