బంగ్లా యుద్ధం – 31
భారతదేశం, పాకిస్తాన్ల మధ్య పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైనప్పుడు, ప్రతిపక్ష పార్టీలు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి అనూహ్యమైన రీతిలో మద్దతుగా నిలిచాయి. యుద్ధంలో పాకిస్థానీ సేనలు బేషరతుగా లొంగిపోయిన్నట్లు ప్రధాని దిగువసభలో ప్రకటించిన సందర్భంలో పార్టీలకు అతీతంగా, సభ్యులంతా నిలబడి, చప్పట్లు కొడుతూ “జోయ్ బంగ్లా”, “బంగ్లాదేశ్ లాంగ్ లివ్”, “ఇందిరా గాంధీ లాంగ్ లివ్” అని నినాదాలు చేస్తూ కాగితాలను గాలిలోకి విసురుతూ ప్రశంసలు కురిపించారు. బహుశా 75 ఏళ్ళ భారత పార్లమెంట్ చరిత్రలో అవి చాలా అరుదైన దృశ్యాలు అని చెప్పవచ్చు.
అదే సంవత్సరం మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆమె ఐక్య ప్రతిపక్షాన్ని ఓడించి తిరిగి అధికారంలోకి వచ్చారు. అధికార – ప్రతిపక్షాల మధ్య విధానాల పరంగా తీవ్రమైన రాజకీయ విబేధాలు కొనసాగుతున్న సమయం. ఎన్నికలు జరిగి కేవలం ఎనిమిది నెలలైనా తర్వాత ప్రతిపక్షాలు ఆమెకు ఆ విధంగా బాసటగా నిలబడటం కూడా అపూర్వం.
“క్లిష్ట సమయంలో అన్ని పార్టీల మద్దతుకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ ఆమె అఖిలపక్ష సమావేశంలో ప్రసంగిస్తూ తన కృతజ్ఞతలను వ్యక్తం చేశారు. సిపిఐ, డిఎంకె నాయకులతో పాటు, జనసంఘ్‌కి చెందిన పితాంబర్ దాస్, ఆమెతో విబేధం కారణంగా కాంగ్రెస్ నుండి విడిపోయిన కాంగ్రెస్ (ఓ) మొరార్జీ దేశాయ్ వంటి వారు ప్రధానమంత్రిని ప్రశంసించడంలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు .ప్రతిపక్ష నాయకులందరిలో సిపిఎం మాత్రమే వ్యక్తిగతంగా పొగడ్తలు లేకుండా కొంచెం గంభీరంగా వ్యవహరించింది.
భారతీయ ఎయిర్‌ఫీల్డ్‌పై పాక్ వైమానికదళం దాడి జాతీయ అత్యవసర పరిస్థితిని సృష్టించిందనే వాస్తవం గుర్తించిన ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని ఆ కాలంలోని ఇతర వార్తా కధనాలు స్పష్టం చేస్తున్నాయి.
“ప్రధానమంత్రి ఇప్పుడు దేశాన్ని శత్రువుపై పూర్తి విజయానికి నడిపించాలి. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం మరిన్ని అధికారాలను పొందాలనుకుంటే, మా పార్టీ తన పూర్తి సహకారాన్ని అందించడానికి వెనుకాడదు” అని తర్వాత బిజెపిగా పరిణామం చెందిన నాటి ప్రధాన ప్రతిపక్షం జనసంఘ్ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయి స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐతో పాటు ఆ పార్టీతో విభేదించి, చీలిక పార్టీగా ఏర్పాటై అప్పుడప్పుడే పుంజుకొంటున్న సిపిఎం కూడా ప్రభుత్వానికి మద్దహతు పలికాయి. జవహర్ లాల్ నెహ్రు విధానాలతో విభేదించి సి రాజగోపాలాచారి ఏర్పాటు చేసిన స్వతంత్ర పార్టీ సహితం అండగా నిలిచింది. డిఎంకెతో సహా ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి.
భారత్ – పాక్ ల మధ్య 13 రోజుల యుద్ధం జరగడంతో డిసెంబర్ 3న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. బంగ్లాదేశ్‌కు మద్దతు అందించడంలో ఆమె స్థిరంగా ఉన్నారు. భారత్‌ను కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించేందుకు అమెరికా ఎంతగా ప్రయత్నించినప్పటికీ. ప్రతిపక్షాలు సహితం అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యంగానే ఉన్నాయి.
లోక్‌సభలో వాజ్‌పేయి, రాజ్యసభలో ఎస్ఎన్ మిశ్రాతో సహా ప్రతిపక్ష నాయకులు పార్లమెంటులో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ “భారత వ్యతిరేక ప్రకటనలను” ముక్తకంఠంతో ఖండించారు. బాలరాజ్ మధోక్, ఎల్ కె అద్వానీ, కేడర్ నాథ్ సహానీ లతో సహా ఇతర జనసంఘ్ నాయకులు అమెరికా రాయబార కార్యాలయం వెలుపల ప్రదర్శనలకు నాయకత్వం వహించారు.
సిపిఐ, డీఎంకే లతో సహా ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా అమెరికాకు వ్యతిరేకంగా నిరసనల ప్రదర్శనలు నిర్వహించాయి. ఆసక్తికరంగా, 1971లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా, జనసంఘ్ నాయకుడు వాజ్‌పేయి, స్వతంత్ర పార్టీ అధినేత పి.కె డియో, ప్రధానమంత్రికి “గట్టిగా మద్దతు” ఇచ్చారు. అసెంబ్లీల కాలపరిమితిని ఒక సంవత్సరం పాటు కొనసాగించాలని వాదించారు. అయితే సిపిఎం నాయకులు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మాత్రమే ప్రతిపక్షం ప్రభుత్వ విధానాల పట్ల తమ అసమ్మతిని తెలియజేయడం ప్రారంభించాయి. కాల్పుల విరమణ ప్రకటించాలన్న ప్రభుత్వ నిర్ణయం.. ఏకపక్ష కాల్పుల విరమణ నిర్ణయంతో తాను పూర్తిగా ఏకీభవించడం లేదని, ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని కోరుతూ ముఖ్యంగా జనసంఘ్ అధ్యక్షుడు వాజ్‌పేయి నుంచి ప్రధాన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
“మన జవాన్లు యుద్ధ భూమిలో గెలుపొందిన విజయాలను దేశం చర్చల సమయంలో నష్టపోవడానికి సిద్ధంగా లేదు” అంటూ స్పష్టం చేశారు. “పశ్చిమ ఫ్రంట్‌లో యథాతథ స్థితిని మేము అనుమతించము. ప్రతి ఐదేళ్లకోసారి చెలరేగుతున్న పాకిస్థాన్ దురాక్రమణకు ఈ యుద్ధం ఒక్కసారిగా ముగింపు పలకాలి” అంటూ ఆయన గర్జించారు.