పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండు చేస్తూ ఢిల్లీ శివారుల్లో ఒకవైపు అన్నదాతలు ఆందోళన కొనసాగుతుండగా చండీగఢ్‌లో గురువారం ముగ్గురు కేంద్రమంత్రులు రైతు నాయకులతో అర్థరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించలేదు. ఆందోళన మొదలయిన తరువాత ఇవి మూడో దఫా చర్చలు కావడం విశేషం.
రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్. గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. అయితే రైతుల డిమాండ్లపై స్పష్టత రాలేదు. మరోవంక, శుక్రవారం భారత్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. శాంతియుతంగా బంద్ కొనసాగనుంది.
కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చాలా సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. రైతు సంఘం హైలైట్ చేసిన అంశాలపై దృష్టి సారించి, తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరొసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపనుందని పేర్కొంటూ శాంతియుతంగా పరిష్కారం కనుగొంటామని అర్జున్ ముండా ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ..రైతుల నిరసన శాంతియుతంగా కొనసాగుతోందని, ఆదివారం వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోతే ఆందోళన మళ్ళీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అప్పటివరకు సరిహద్దుల్లోనే వేచి చూస్తామని జగ్జిత్ సింగ్ దల్లేవాల్ చెప్పారు.
కాగా పంటలకు ఎంఎస్పీ చట్టం, రుణమాఫీ సహా తమ వివిధ డిమాండ్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ‘ఢిల్లీ చలో’ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాయి. ఆ క్రమంలో హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో చేస్తున్న నిరసనలు మరింత వ్యాపించాయి. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయా ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై విధించిన ఆంక్షలను ఫిబ్రవరి 17 వరకు పొడిగించింది.
రైతులు కేంద్ర ప్రభుత్వంతో తాజా చర్చలకు ముందు గురువారం పంజాబ్‌లో రైలో రోకో నిర్వహించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పంజాబ్, హరియాణలో రైతులు ఆందోళనను తీవ్రతరం చేశారు. రైతుల నిరసనలతో పంజాబ్ సరిహద్దు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 16 రాత్రి వరకూ హరియాణ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రైతుల ఛలో ఢిల్లీ ప్రదర్శనలో భాగంగా రైతులు ఎక్కడికక్కడ బారికేడ్లను ధ్వంసం చేసి ముందుకు సాగుతుండటంతో ఉద్రిక్తత నెలకొంది.
గ్రామీణ భారత్ బంద్ కారణంగా.. రవాణా వ్యవస్థ, వ్యవసాయ కార్యకలాపాలు, ఎంఎన్ఆర్ఈజీఏ (మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్) పనులు, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామీణ దుకాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్, సర్వీస్ సేక్టార్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే.. భారత్ బంద్‌లో అంబులెన్స్ సర్వీసులు, న్యూస్ పేపర్ పంపిణీ, పెళ్లిల్లు, మెడికల్ షాప్‌లు, విద్యార్థుల పరీక్షలు వంటి ఎమర్జెన్సీ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
.