కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ కుటుంబ పార్టీలు, అవినీతిమయం అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఆరోపించారు. న్యూఢిల్లీలో బిజెపి జాతీయ సమ్మేళనంలో ప్రసంగించిన అమిత్ షా ఆనువంశిక, బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నందుకు ప్రతిపక్ష ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.
‘మహాభారత యుద్ధంలో కౌరవులు, పాండవుల శిబిరాలు ఉన్న మాదిరిగా ఇప్పుడు ఎన్నికలకు ముందు రెండు శిబిరాలు ఉన్నాయి’ అని అమిత్ షా చెప్పారు. ‘ఇండియా కూటమి అన్ని ఆనువంశిక పార్టీల సంకీర్ణం. వంశపారంపర్యం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలను అవి పెంచి పోషిస్తున్నాయి. కాని బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ దేశ సిద్ధాంతాలను అనుసరించే పార్టీల సంకీర్ణం’ అని ఆయన పేర్కొన్నారు.
ఆ రెండు శిబిరాలలో దేనికి అనుకూలంగా తాము ఈ దఫా తీర్పు ఇవ్వాలో దేశ ప్రజలు నిర్ణయించుకోవలసి ఉంటుంది’ అని అమిత్ షా సూచించారు. ‘బిజెపి: దేశ్ కీ ఆశా, విపక్ష కీ హతాశా (బిజెపి: దేశం ఆశ, ప్రతిపక్షం నిస్పృహ)’ అనే తీర్మానంపై ప్రసంగం సందర్భంగా అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షం ‘2జి, 3జి, 4జి’ పార్టీల మయం అని ఆయన అన్నారు. ఆ పార్టీలను నడిపే రెండవ, మూడవ, నాలుగవ తరం కుటుంబాల గురించి ఆయన ఆ విధంగా ప్రస్తావించారు. ‘ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ అవినీతి, ఆనువంశికత, బుజ్జగింపు విధానాలతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అంతం చేసిందని, దాని వల్ల ప్రజల తీర్పు స్వతంత్రంగా రాదని అమిత్ షా విమర్శించారు.
ప్రతిపక్షాల ఆనువంశిక, అవినీతి, బుజ్జగింపు, కులతత్వ రాజకీయాలకు ముగింపు పలకడం ద్వారా ప్రధాని మోడీ కేంద్రం స్థాయిలో అభివృద్ధి రాజకీయాలు తెచ్చారని అమిత్ షా కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రధాని పాటుపడ్డారని, ప్రపంచంలో దేశం స్థాయిని ఆయన పెంచారని హోమ్ మంత్రి చెప్పారు. ప్రధాని మోదీ మూడవ సారి అధికారాన్ని నిలబెట్టుకుంటారని ప్రజలు దృఢ నిశ్చయానికి వచ్చారని అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు.