మద్దతు ధరను చట్టబద్దం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రులు గత రాత్రి జరిపిన నాల్గవ విడత చర్చలు సానుకూలంగా ముగిసాయి. ఐదు పంటలకు ఐదేళ్లపాటు మద్దతు ధరకు హామీ ఇస్తూ, వాటిని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయిస్తామని కేంద్ర మంత్రులు భరోసా ఇచ్చారు.
కేంద్రం ప్రతిపాదనలపై తమ ఫోరమ్ లో చర్చించి, నిపుణుల అభిప్రాయాలు తీసుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని రైతు సంఘాలు తెలిపాయి. సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు చర్చలు కొనసాగాయి.ఈ చర్చలో ఎంఎస్పీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది.
రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్ సి సి ఎఫ్, నాఫెడ్ వంటి సహకార సంఘాలు, కాటన్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు.
కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండదని స్పష్టం చేశారు. దీని కోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. తమ ప్రతిపాదనల వల్ల పంజాబ్లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని తెలిపారు. వారి సాగు తగ్గుముఖం పట్టి భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయని, సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని చెప్పారు.
“రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజేన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని మా బృందం ప్రకటించింది. మినుములు, మైసూర్ పప్పు, కందులు, మొక్కజొన్న పండించే రైతులతో ఎన్సీపీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయి. కొనుగోళ్లపై ఎలాంటి పరిమితి ఉండదు. దీని కోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తాం. దీంతో పంజాబ్లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుంది. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయి. సాగు భూములు సిస్సారంగా మారకుండా ఉంటాయి.’’ అని పీయూష్ గోయల్ తెలిపారు.
ఇక ప్రభుత్వ ప్రాతిపాతనపై నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. మరో రెండు రోజుల్లో తమ ఇతర డిమాండ్లు కూడా పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆదివారం రాత్రి రైతు నేతలతో కేంద్రం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చర్చలు జరిపారు. రైతులు, కేంద్రం మధ్య జరిగిన ఈ చర్చల్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 8.15 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు వరకు ముగిశాయి.