ఆదివారం రాత్రి పొద్దుపోయేంతవరకు రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదు సంవత్సరాలకు, ఐదు పంటలకు మాత్రమే ఉద్ధేశించిన కాంట్రాక్టు ఎంఎస్పి ప్రతిపాదనను సంయుక్త కిసాన్ మోర్ఛా *ఎస్‌కెఎం) తిరస్కరించింది. అన్ని పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర ప్రకటించాలన్న రైతాంగ డిమాండ్‌ను పక్కదోవ పట్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చిందని విమర్శించింది.
కేంద్రం ప్రతిపాదనలు రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేదని తేల్చిచెప్పారు. అంతేకాదు, బుధవారం నుంచి తమ ఆందోళనలు మళ్లీ ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా బిజెపి, ఎన్‌డిఎ ఎంపిల నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్ఛా పిలుపునిచ్చింది.
శాంతియుతంగా బహిరంగ సభలు, కాగాడాల ప్రదర్శనలతోపాటు ఇతర నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించాలని సూచించింది నాలుగో విడతగా ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఏమాత్రం పారదర్శకత లేదని ఎస్‌కెఎం విమర్శించింది. కనీస మద్దతు ధరతోపాటు ఇతర డిమాండ్లుయైన రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ, సమగ్ర ప్రభుత్వ రంగ పంటల బీమా పథకం, 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలవారీ రూ.10 వేల పెన్షన్, లఖింపూర్ ఖేరీ మారణకాండకు ప్రధాన కుట్రదారు కేంద్ర హోం సహాయ మంత్రి అజరు మిశ్రాను తొలగించి, ప్రాసిక్యూట్ చేయాలనే డిమాండ్లపై మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో స్పష్టం చేయాలని ఎస్‌కెఎం కేంద్ర మంత్రులను డిమాండ్ చేసింది.
ఫిబ్రవరి 21, 22 తేదీల్లో జరగనున్న ఎస్‌కెఎం జనరల్ బాడీ సమావేశం పరిస్థితిని సమీక్షిస్తుందని, అన్ని డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటాన్ని ఉధృతం చేయడానికి భవిష్యత్ కార్యాచరణలను ప్రణాళిక చేస్తుందని తెలిపింది. మరోవంక, హర్యానా పోలీసులు, కేంద్ర బలగాలు ఢిల్లీకి మార్చ్ చేస్తున్న రైతులపై పెల్లెట్ గన్లను ప్రయోగించకుండా ఆపేలా జోక్యం చేసుకోవాలని మానవ హక్కుల సంఘాలు కోరాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాశాయి.