ప్రకాశం జిల్లా ఒంగోలులో కత్తిపోట్ల కలకలం రేగింది. తెలుగు రైతు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. ఒంగోలులోని జిమ్స్ ఆస్పత్రిలో శ్రీనివాసరెడ్డిపై కత్తితో దాడి జరిగింది. దాడి అనంతరం శ్రీనివాసరెడ్డిని సంఘమిత్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శ్రీనివాసరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోగ్యపరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాసరెడ్డిపై ముందస్తు ప్రణాళికతోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఒంగోలులోని జయరాం సెంటర్లో ఉన్న జిమ్స్ ఆస్పత్రి ప్రధాన వైద్యుడు రామచంద్రారెడ్డితో శ్రీనివాసరెడ్డికి ఆర్థిక పరమైన లావాదేవీలలో సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీటిపై చర్చిద్దామని శ్రీనివాసరెడ్డిని ఆస్పత్రికి పిలిపించారు. ఆర్థిక లావాదేవీలపై మాట్లాడుతున్న సమయంలోనే డాక్టర్ రామచంద్రారెడ్డి అనుచరులుగా భావిస్తున్న కొంతమంది ఒక్కసారిగా శ్రీనివాసరెడ్డిపై దాడి చేశారు.
కత్తితో విచక్షణారహితంగా పొడిచిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ నేపథ్యంలో చర్చల కోసం అంటూ పిలిచి ప్లాన్ పకారం దాడి చేశారని భావిస్తున్నారు. ఊహించని దాడితో మర్రెడ్డి శ్రీనివాసరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని స్థానికంగా ఉన్న సంఘమిత్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం మర్రెడ్డి ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మర్రెడ్డిపై దాడి ఘటనతో ప్రశాంతంగా ఉండే ఒంగోలు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కత్తులతో దాడి ఘటనకు ఆర్థిక వ్యవహారాలే కారణమా, ఇంకేదైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.